భుజ్‌బల్‌పై పోటీకి సిద్ధం: పాండరే
సాక్షి, ముంబై: పార్టీ ఆదేశిస్తే నాసిక్ నుంచి ఎన్సీపీ నాయకుడైన ఛగన్ భుజ్‌బల్‌కు వ్యతిరేకంగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆప్ నాయకుడు విజయ్ పాండరే తెలిపారు. ఢిల్లీ విజయంతో దేశవ్యాప్తంగా చర్చల్లోకెక్కిన ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) రాష్ట్రంలోకూడా పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న విషయం విదితమే.
ముఖ్యంగా జలవనరుల శాఖ, సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి కుంభకోణాలను బట్టబయలు చేసిన అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసిన పాండరే ఇటీవలే ఆప్‌లో చేరిన సంగతి తెలిసిందే. ప్రజల్లో ఆయనకు ప్రత్యేక గౌరవముంది. ముఖ్యంగా అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి పదవికే కాక, ఇతర పదవులకు కూడా రాజీనామా చేయాల్సి వచ్చేలా చేసిన విజయ్ పాండరే నాసిక్‌లో ఎన్నికల్లో ముఖ్యంగా ఎన్సీపీకి వ్యతిరేకంగా పోటీకి దిగనున్నట్టు పేర్కొనడంతో ఎన్సీపీ కొంత ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. మరోవైపు అవినీతి పరులకు ప్రజలు బుద్ధిచెబుతారన్న నమ్మకం తమకు ఉందని ఆయన పేర్కొంటున్నారు.
ధైర్యముంటే కొల్హాపూర్ నుంచి పోటీ చేయాలి
టోల్ విషయంపై కొల్హాపూర్ ప్రజలను ఉద్దేశించి ఛగన్ భుజ్‌బల్ చేసిన వ్యాఖ్యలపై కొల్హాపూర్ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా టోల్‌ను వ్యతిరేకించేందుకు ఏర్పాటైన ‘టోల్ విరోధి కృతి సమితి’ పదాధికారి నివాస్ సాలోంకే, ఛగన్ భుజ్‌బల్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టోల్ విషయంపై అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రారంభం సమయంలో కొల్హాపూర్ ప్రజలు పడుకున్నారా అని భుజ్‌బల్ వ్యాఖ్యానించడంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. భుజ్‌బల్‌కు ధైర్యం ఉంటే నాసిక్‌కు బదులు కొల్హాపూర్ నుంచి పోటీ చేసి గెలవాలని సాలోంకే సవాల్ విసిరారు.