విజయ పాల ధర రూపాయి పెంపు
నేటి నుంచి అమల్లోకి కొత్త ధర
సాక్షి, హైదరాబాద్: పాడి రైతులకు ఉగాది కానుకగా పాల సేకరణ ధరను లీటరుకు గరిష్టంగా రూ.2 చొప్పున పెంచిన తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య అందులో రూపాయి భారాన్ని వినియోగదారులపై మోపింది. విజయ పాల ధరను లీటరుకు రూపాయి చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. నేటి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని సమాఖ్య చైర్మన్ లోకా భూమారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
పాల సేకరణ ధర పెంపు సైతం నేటి నుంచే అమల్లోకి వస్తుందన్నారు. 2017 జనవరి వరకు రూ.4 చొప్పున ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రోత్సాహక ధర బకాయిలను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, ఫిబ్రవరి నుంచి పాల బిల్లులతోపాటే ప్రోత్సాహకం చెల్లిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆరు శాతం వెన్న ఉన్న గేదె పాలకు లీటరుకు రూ. 35.80 రైతులకు చెల్లిస్తుండగా.. పెరిగిన ధర ప్రకారం రూ. 37.80 చెల్లిస్తామన్నారు. అలాగే 3.5 శాతం వెన్న ఉన్న ఆవు పాలకు ప్రస్తుతం లీటరుకు రూ. 28.36 చెల్లిస్తుండగా ఇకపై రూ. 30.36 చెల్లిస్తామని చెప్పారు.