హవాలా అంటే ఏంటో కూడా తెలియదు: బ్రహ్మాజీ
జీవితంలో తాను ఎప్పుడూ తప్పు చేయలేదని, ఎవరైనా సాయం అడిగితే చేశాను తప్ప చట్టాన్ని ఏనాడూ ఉల్లంఘించలేదని విజయవాడ సెంటినరీ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న బ్రహ్మాజీరావు చెప్పారు. అసలు తనకు హవాలా అంటే నిర్వచనం ఏంటో కూడా తెలియదని అన్నారు. ఆస్పత్రిలో ఉన్న బ్రహ్మాజీతో 'సాక్షి టీవీ' ప్రతినిధి ప్రత్యేకంగా మాట్లాడారు. డాక్టర్ పువ్వాడ రామకృష్ణ, సన్నీ, చల్లపాటి రవి, వాళ్ల అన్న వెంకటేశ్వరరావు, వాళ్లకు మద్దతుగా ఉన్న కొంతమంది రౌడీలు కలిసి తనను ఎత్తుకెళ్లి వారం రోజుల పాటు కొట్టి, ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి తన ఇంట్లో వదిలేశారని, తాను ఆస్పత్రికి వస్తే వెంటనే తన పరిస్థితి చూసి ఐసీయూలో చేర్చారని ఆయన చెప్పారు.
తనను కొట్టి, తన ఒంటి మీద ఉన్న దాదాపు రూ. 2 కోట్ల విలువ చేసే నగలను వాళ్లు లాక్కున్నారని, పిల్లలు లేనివాడివి ఆస్తిపాస్తులు నీకెందుకంటూ బలవంతంగా డాక్యుమెంట్ల మీద సంతకాలు చేయించుకున్నారని, ఇంటి దగ్గర ఉన్న కొన్ని వజ్రాలు కూడా తీసుకెళ్లారని ఆయన తెలిపారు. అయితే వాటి విలువ ఎంత ఉంటుందో మాత్రం తనకు తెలియదన్నారు. తన ఆస్తి మొత్తం స్వాహా చేయాలన్నది వాళ్ల ప్రయత్నమని.. వారిలో రవి మాత్రమే తనకు 40 ఏళ్లుగా పరిచయం ఉన్నారు తప్ప మిగిలిన వాళ్లెవరూ తనకు తెలియదని చెప్పారు. ఇప్పుడు చూస్తే హవాలా అంటున్నారని, అదేమీ తనకు తెలియదని బ్రహ్మాజీ చెప్పారు. గతంలో తాను, తన భార్య కలిసి రెండు రోజుల పాటు సింగపూర్ వెళ్లి వచ్చామని, అంతేతప్ప తనకు విదేశాలతో సంబంధాలు కూడా లేవని అన్నారు. తాను బతికి బట్టకట్టినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకొంటున్నానని చెప్పారు. తన వద్ద దోచుకున్న సొత్తు ఇచ్చేస్తాం, కేసు వద్దని వెంకటేశ్వరరావు మనుషులు అన్నారు గానీ, ఆ సొత్తు ఇప్పుడు పోలీసుల దగ్గర ఉందని ఆయన తెలిపారు. కిడ్నాప్‌లో రవి పాత్రే ఎక్కువని చెప్పిన ఆయన.. తాను మాత్రం జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదని అన్నారు.
ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సమక్షంలోనే..
ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌ను సన్నీ అనే వ్యక్తి పిలిచాడని, అతడి సమక్షంలోనే తనను కొట్టారని బ్రహ్మాజీ ఆరోపించారు. ఆ రిపోర్టర్ బక్కగా, బారుగా ఉన్నాడని చెప్పారు. అతడికి, వైద్యులకు కూడా సంబంధం ఉండే ఉంటుందని అన్నారు. తనను బంధించి చిత్రహింసలు పెడుతుంటే విలేకరి అక్కడకు వచ్చాడని, తనను కొడుతుంటే పక్కనే కూర్చుని వాళ్లిచ్చిన బీర్లు తాగుతున్నాడని తెలిపారు. వాళ్లు చెప్పమన్ విషయాలు తాను చెబుతుండగా షూట్ చేశాడని అన్నారు. వాళ్లు చెప్పడంతోనే అతను ఆంధ్రజ్యోతి రిపోర్టరని తెలిసిందన్నారు. వాళ్ల ముఠా కాకపోతే తనను కొడుతున్నా రిపోర్టర్ అన్నవాడు చూస్తూ ఊరుకుంటాడా, వాళ్లిచ్చిన బీర్లు తాగుతాడా అని ఆయన ప్రశ్నించారు. తాను ఎవరికీ వడ్డీకి డబ్బులు అప్పు ఇవ్వలేదని చెప్పారు. తనను వడ్డీ వ్యాపారి అంటున్నారని, తన వద్ద అప్పు తీసుకున్నట్లు ఒక్కరితో అయినా చెప్పించాలని అడిగారు. కావాలంటే తన సెల్‌ఫోన్ ట్రాక్ చేసుకోవచ్చని కూడా బ్రహ్మాజీ అన్నారు.