బాబు స్వార్థ రాజకీయాలకు ముగింపు
విజయనగరం మున్సిపాలిటీ: చంద్రబాబు స్వార్థ పూరిత రాజకీయాలకు ప్రజలు ముగింపు పలకాలని వైఎస్సార్ సీపీ విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి కోరారు. అయ్యన్నపేట, వసంతవిహార్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించిన కోలగట్ల 11న జరిగే పోలింగ్లో రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి సంక్షేమ పాలనకు నాంది పలకాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో గంపెడు హామీలిచ్చి అమలు చేయలేకపోయారన్నారు.
పదేళ్ల పాటు హైదరాబాద్ రాజధానిపై మనకు హక్కున్నా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి కేసీఆర్కు ధారాదత్తం చేశారన్నారు. సొంత కేసుల కోసం భయపడిన వ్యక్తి మనకేం చేస్తారో ఆలోచించాలన్నారు. రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు సహా అన్నింటా అవినీతి జరుగుతోందన్నారు. రాష్ట్రంలో దోచుకో.. దాచుకో పాలన సాగుతోందన్నారు. ఇళ్లు, పింఛన్ ఇవ్వాలంటే లంచం చెల్లించే పాలన సాగిందన్నారు. జగన్ ముఖ్యమంత్రి పాలన అయితే మాట తప్పని.. మడమ తిప్పని నాయకునిగా నవరత్నాల ద్వారా సంక్షేమ పాలన అందిస్తారన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
అవినీతి రహిత పాలనే ధ్యేయం
అవినీతి రహిత పాలన ధ్యేయమని వైఎస్సార్ సీపీ విజయనగరం నియోజవర్గ శాసనసభ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్ద మార్కెట్ పరిసరాల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కూరగాయల వర్తకులను అభ్యర్థించారు.
నూకాలమ్మ తల్లికి పూజలు
నూకాలమ్మ తల్లి ఆశీస్సులు విజయనగరం ప్రజలపై సదా ఉండాలని కోలగట్ల వీరభద్రస్వామి కోరారు. తన ప్రచారంలో భాగంగా శుక్రవారం మంగలివీధి మార్కెట్లో శ్రీ నూకాలమ్మ వారిని కోలగట్ల దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రతినిధులు గురాన అయ్యలు, ఎడ్ల రాజేష్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం ప్రచారంలో భాగంగా మంగలివీధిలోని ప్రముఖ వ్యాపారి, సీనియర్ రాజకీయవేత్త దివంగత గురాన సాధురావు గృహానికి చేరుకోగానే ఆయన సతీమణి కోలగట్లకు దీవెనలు అందించారు. కార్యక్రమంలో పార్టీ వాణిజ్య విభాగం నాయకులు రవ్వ శ్రీనివాస్, కొత్త నరసింహం (ఊటీ), పాల్గొన్నారు.