సృజనాత్మకత బయటపడుతుంది...
విజయవాడ (మొగల్రాజపురం): ఎప్పుడు చదువే కాకుండా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడల వైపు దృష్టి పెట్టడం వల్ల వారిలో ఉన్న సృజనాత్మకత బయటపడుతుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలోత్సవ్–2016 పేరుతో పాఠశాల స్థాయి విద్యార్థులకు పి.బి.సిద్ధార్థ ఆడిటోరియంలో వివిధ అంశాల్లో సోమవారం పోటీలు నిర్వహించారు. అనురాధ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ ప్రైవేటు స్కూల్స్ వారు సంఘంగా ఏర్పడి ఐదేళ్లుగా క్రమం తప్పకుండా బాలోత్సవ్ నిర్వహిస్తున్న సంఘం సభ్యులను అభినందించారు. సభకు అధ్యక్షత వహించిన విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు చండ్ర సరళ మాట్లాడుతూ స్పోర్ట్స్, అకడమిక్, కల్చరల్ విభాగాల్లో సుమారు 80కి పైగా అంశాల్లో పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. బాలోత్సవ్–2016 కన్వీనర్ వెనిగళ్ల మురళీమోహన్ మాట్లాడుతూ ఐదేళ్లుగా క్రమం తప్పకుండా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.సుందరరామ్ మాట్లాడుతూ విద్యార్ధుల మానసిక, శారీరక ఎదుగుదలకు పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయని చెప్పారు. కార్యక్రమంలో వి.సి.యస్.అండ్ టి.ఏ. కార్యదర్శి దాసరి వెంకటనాగసుధాకర్, కోశాధికారి అనుమాటి చెన్నయ్య, మీడియా కో ఆర్డినేటర్ ఎ.సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సందడే...సందడి...
ఎప్పుడూ తరగతి గదుల్లో ఉండే చిన్నారులు ఒక్కసారిగా బయటకు వచ్చి సందడి చేశారు. సభ అనంతరం మొదలైన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆ«ధ్యంతం ఆకట్టుకున్నాయి. క్లాసికల్ డ్యాన్స్‌లో భక్తి పాటలకు విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. శివపార్వుతులు, హరిదాసు, హనుమంతుడు, పెళ్ళికూతురు, అల్లూరి సీతారామరాజు, సరస్వతిదేవి, మహిషాసురమర్ధిని, కృష్ణుడు వంటి వేషాలు ఆకట్టుకున్నాయి. జానపద నృత్యాలతో అదరగొట్టారు. వి.పి.సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ఆవరణలోని మైదానంలో విద్యార్థులకు స్పోర్ట్స్ ఈవెంట్స్ నిర్వహించారు. బేబీ జూనియర్స్‌కు పలు పోటీలు నిర్వహించారు. విజేతలకు బుధవారం జరిగే ముగింపు సభలో బహుమతులు అందచేస్తామని నిర్వాహకులు తెలిపారు.