ఎస్సారెస్పీ నీటితో చెరువులు నింపాలి
వారంలో నీరు విడుదల చేయకుంటే దీక్ష
టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు
టవర్సర్కిల్ : ఎస్సారెస్పీ ఉపకాలువతోపాటు ఆయకట్టు ప్రాంతంలోని చెరువులు, కుంటలను నింపేందుకు వీలుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్. విజయరమణారావు డిమాండ్ చేశారు. ఈమేరకు పలు అంశాలపై టీడీపీ ప్రతినిధుల బందం సోమవారం కలెక్టర్కు వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ ఎస్సారెస్పీ నుంచి నీరు విడుదల చేయాలని, ఆయకట్టు ప్రాంతంలోని చెరువులు, కుంటలను నీటితో నింపాలని, రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షాలు పడక రైతులు బెంబేలెత్తిపోతున్నారని తెలిపారు. వారంలోగా ఎస్సారెస్పీ నీటి విడుదలపై జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయం ప్రకటించకపోతే నిరవధిక దీక్షకు పూనుకుంటానని హెచ్చరించారు. కరువు నివారణ చర్యలను ప్రభుత్వం సకాలంలో చేపట్టకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని గొప్పగా చెప్పుకున్న ప్రభుత్వం ఆచరణలో విఫలమైందన్నారు. నాయకులు అన్నమనేని నర్సింగరావు, గంట రాములుయాదవ్, కళ్యాడపు ఆగయ్య, రొడ్డ శ్రీనివాస్, చెల్లోజు రాజు, సాయిరి మహేందర్, పాలరామారావు, కుమార్కిషోర్, పుట్ట నరేందర్, దూలం రాధిక, అనసూర్యనాయక్ పాల్గొన్నారు.