విమోచనదినోత్సవం అధికారికంగా నిర్వహించాలి
– బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి
జడ్చర్ల టౌన్ : అధికారంలోకి రాకముందు సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరిపిస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే ఎంఐఎంకు తొత్తుగా మారి విస్మరించారని, ఈ ఏడాది విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాల్సిందేనని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి డిమాండ్ చేశారు. తిరంగా యాత్రలో భాగంగా శనివారం బాదేపల్లి పట్టణం నేతాజీ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కర్ణాటక రాష్ట్రంలోని 3జిల్లాలు, మహరాష్ట్రలోని 5జిల్లాల్లో సెప్టెంబర్ 17ను స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుతున్నారని గుర్తుచేశారు. తిరంగా యాత్రలో తాము గ్రామ గ్రామానికి వెళ్లి సెప్టెంబర్ 17న స్వాతంత్య్రం వచ్చిన విషయాన్ని ప్రజలకు తెలియజేసి చైతన్యం చేస్తామన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగురావు నామాజీ మాట్లాడుతూ మాట ఇస్తే మడమతిప్పను అన్న కేసీఆర్ నేడు ఎందుకు మాట తప్పారని, విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. సమావేశంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పాలాదిరాంమోహన్, నాయకులు శాంతకుమార్, కళ్యాణ్, నరేందర్, రమేష్జి, రాపోతుల శ్రీనివాస్‌గౌడ్, నాగరాజు, మధు, సామల నర్సింహులు, సారంగినవీన్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.