ఖరీఫ్ దిగుబడి లక్ష్యం 12.50 లక్షల టన్నులు
తాడేపల్లిగూడెం రూరల్ :ఖరీఫ్‌లో జిల్లాలోని 2.38 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తారని అంచనా వేసినట్టు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు వి.సత్యనారాయణ చెప్పారు. తాడేపల్లిగూడెం వ్యవసాయ సహాయ సంచాలకుని కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఖరీఫ్‌లో 12.5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి లక్ష్యంగా నిర్దేశించినట్టు తెలిపారు. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సిద్ధంగా ఉన్నాయన్నారు. విత్తనాలను ఏపీ సీడ్స్, 9 సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి సేకరించినట్టు తెలిపారు. ఏపీ సీడ్స్ ద్వారా 10 వేల క్వింటాళ్ల విత్తనాలు సేకరించగా వీటిలో స్వర్ణ, 1010, 1001, 1061 వంగడాలు ఉన్నాయన్నారు. సీడ్ వీలేజ్ ప్రోగ్రామ్ ద్వారా 20 వేల క్వింటాళ్లు, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా 35 వేల క్వింటాళ్ల విత్తనాలు సేకరించామని చెప్పారు.
2.17 లక్షల టన్నుల ఎరువులు అవసరం
ఈ ఖరీఫ్ సీజన్‌కు జిల్లాకు 2.17 లక్షల టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేశామని జేడీ పేర్కొన్నారు. 40 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటిని మార్క్‌ఫెడ్ గోదాముల్లో, సొసైటీల్లో ఉంచామని చెప్పారు. ఎరువులను సబ్సిడీపై రైతులకు అందిస్తున్నట్టు తెలిపారు. ఎరువులను పంటలకు మాత్రమే ఉపయోగించాలని, చేపల చెరువులకు తరలించడం వంటివి చేసే రైతులపై చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు కాకుండా ఇతరులకు విక్రయించిన డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాకు కేటాయించిన ఎరువులను పక్క జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు తరలిస్తే లెసైన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. దీనిపై రైతులు నిఘాపెట్టి అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఖరీఫ్‌కు ముందస్తు నారుమళ్లు వేసుకోవాలి
ఈ ఖరీఫ్‌కు ముందస్తు నారుమళ్లు వేసుకునేందుకు రైతులు సన్నద్ధం కావాలని జేడీ రైతులకు పిలుపునిచ్చారు. ఈ ఏడాది డిసెంబర్ తరువాత కాలువల ఆధునికీకరణ పనులను పునః ప్రారంభించనున్న దృష్ట్యా రైతులు పంట ముందుగా చేతికి వచ్చేలా సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు. ఆధునికీకరణ పనులు జరిగే ప్రాంతాల్లో రబీలో ఆరుతడి పంటలకుగాను రైతులను ముందునుంచే సన్నద్ధం చేస్తున్నట్టు వివరించారు.తాడేపల్లిగూడెం ఏడీఏ పీజీ బుజ్జిబాబు, కోట రామచంద్రపురం ఏడీఏ కమలాకరశర్మ, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.