ధర్మపురి గోదావరిలో మొసలి కలకలం
ధర్మపురి : గోదావరిలో మొసలి కనిపించిందన్న విషయం ఆలస్యంగా కలకలం సృష్టిస్తోంది. ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌తో ధర్మపురి వద్ద గోదావరికి నీటిమట్టం భారీగా పెరిగింది. ఈ క్రమంలో వారం క్రితం గోదావరిలో నీరు తాగడానికి వెళ్లిన ఓ పందిని మెుసలి లాక్కొని వెళ్లిందని గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. నీరు బాగా ఉండడంతో ఎగువప్రాంతాల నుంచి నదిలో చేరి ఉంటాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.
2012లో దమ్మన్నపేట రేవులో పట్టుబడిన మొసలి
ధర్మపురికి రెండుకిలోమీటర్ల దూరంలో ఉన్న దమ్మన్నపేట రేవులో 2012లో నిండువేసవిలోనే ఓ మడుగులో మూడు మెుసళ్లు కనిపించాయి. వాటిలో ఓ మెుసలిని అటవీశాఖ అధికారులు అతికష్టంమీద పట్టుకున్నారు. మరో రెండు తప్పించుకుని పారిపోయాయి. పట్టుబడిన మెుసలిని ఫారెస్టు అధికారులు హైదరాబాద్‌లోని జూకు తరలించారు. అప్పట్లో తప్పించుకున్న మెుసళ్లే ప్రస్తుతం గోదావరిలో తిరుగుతున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. మెుసలి విషయం బయటకు పొక్కడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఏదేమైనా గోదావరిలో స్నానాలు చేసేందుకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొంటున్నారు.