పల్లె పాలన @ ఆన్లైన్
ఏలూరు, న్యూస్‌లైన్:పల్లె పాలన ఆన్లైన్ పట్టాలెక్కబోతోంది. ‘ఈ-పంచాయత్స్’ పేరిట పంచాయతీల్లో ఆన్లైన్ సేవలను వినియోగించుకునేందుకు యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని జాతీయ సాంకేతిక సమాచార సంస్థ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. జూన్ మొదటి వారంలోగా జిల్లాలోని 531 కస్లర్ల కింద 858 గ్రామ పంచాయతీల్లో ‘ఈ-పంచాయత్’ విధానాన్ని ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే 531 కంప్యూటర్లు, ఇతర పరికరాలు సంబంధిత ఎంపీడీవో కార్యాలయాలకు చేరాయి.
మూడంచెల విధానం
మూడేళ్ల క్రితమే జిల్లాలో 21 పంచాయతీల్లో ఈ-పంచాయత్ కార్యక్రమం అమల్లోకి వచ్చింది. ఆన్లైన్ సేవలను పర్యవేక్షించే బాధ్యతను కార్వే సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. ఆ సంస్థ ప్రతినిధులు పంచాయతీ సిబ్బందికి ఆన్లైన్ విధానంపై శిక్షణ ఇచ్చారు. ప్రాథమికంగా గ్రామాల్లో జనన, మరణాల నమోదు, ఇంటి పన్నులు, లెసైన్స్ ఫీజు వసూళ్లను ఆన్లైన్ చేయనున్నారు. పనుల పర్యవేక్షణ, పంచాయతీ సమావేశాలు, ప్రజాప్రతినిదుల సమాచారం, ఉద్యోగుల వివరాలు, వేలం నోటీసులు, కోర్టు కేసులు, తనిఖీలు, సమాచార హక్కు చట్టం, ఆడిట్, ఫిర్యాదులకు సంబంధించిన ఎంఐఎస్ రిపోర్టులు, పంచాయతీరాజ్ నిధులకు సంబంధిం చిన సమాచారాన్ని ఆన్లైన్లో ఉంచుతారు. దీనిపై ఇప్పటికే సర్పంచ్‌లకు శిక్షణ ఇచ్చామని, ఆపరేటర్లకు శిక్షణ పూర్తయియందని డీపీవో అల్లూరి నాగరాజు వర్మ తెలిపారు.
నేడు డీఎల్పీవోలు,
ఈవోఆర్డీలకు అవగాహన
గ్రామాల్లో ఆన్ లైన్ సేవలపై జిల్లాలోని ఈవోఆర్డీలు, నలుగురు డీఎల్పీవోలతో కార్వే సంస్థ ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానిక డీపీవో కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని డీపీవో చెప్పారు.