వివాదంలో చిక్కుకున్న ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్
సాక్షి, లక్నో : ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావెద్ హబీబ్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ప్రచారంలో భాగంగా జావెద్ హబీబ్ తన సెలూన్లలో హిందూ దేవుళ్లు, దేవతల చిత్రాలను, కొన్ని వీడియోలను ఉపయోగింకుంటున్నట్లు వినయ్ పాండే అనే న్యాయవాది మహరాజ్‌గంజ్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. దేశ వ్యాప్తంగా ఎందరో ప్రముఖులకు హెయిర్ స్టయిలిస్ట్‌గా ఉన్న హబీబ్ ప్రచారం కోసం మత విశ్వాసాలను వాడుకుంటున్నాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కోట్లాది మంది హిందువుల మనోభావాలను జావేద్ దెబ్బతీశాడని వినయ్ పాండే ఆరోపించారు. హిందూ దేవుళ్లు, దేవతలు తన సెలూన్‌కు వచ్చి కస్టమర్ల మాదిరిగా కూర్చున్నట్లు కొన్ని ప్రకటనల్లో చూపాడని ఇవి సోషల్‌మీడియాలోనూ దర్శనమిచ్చాయని లాయర్ వివరించారు. ఈ కేసును ఈనెల 11వ తేదీన న్యాయస్థానం విచారించనుంది.
హిందూ దేవతలు, దేవుళ్ల ఫొటోలను తన సెలూన్లో ఉపయోగించడంపై హిందూ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి చెత్త ట్రిక్స్ ఎన్ని ప్లే చేసినా నీవద్ద కటింగ్ చేసుకునేందుకు ఎవరూ రారని కొందరు కామెంట్ చేయగా, మర్యాదగా యాడ్స్‌తో పాటు ఫొటోలను అన్ని తీసేస్తే మంచిదంటూ మరికొందరు హెచ్చరిస్తున్నారు.