మెడికల్ హబ్‌గా విజయవాడ
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
విజయవాడ : వైద్యులు మానవతా దృక్పథంతో మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలందించాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. నగరంలోని నక్కలరోడ్డు, కాళేశ్వరరావురోడ్డు కూడలిలో ఆంధ్రా, విన్స్ హాస్పటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఎంతో కీలకమైన హార్ట్ అండ్ బ్రెయిన్‌కు సంబంధించి ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌కే పరిమితమైన సూపర్‌స్పెషాలిటీ సేవలు విజయవాడ, గుంటూరు నగరాలకు విస్తరించనున్నాయని, ఇప్పటికే పలు ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో విజయవాడ మెడికల్ హబ్‌గా మారనుందన్నారు. విద్య, వైద్యం రెండు కళ్లులాంటివని, వీటిలో ఏది లేకుండా దేశాభివృద్ధి జరగదన్నారు. ఈ రెండింటికి ప్రధాన నరేంద్రమోడి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.
రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి నారాయణ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజు, కేశినేని శ్రీనివాస్, కొనకళ్ల నారాయణ, నగర మేయర్ కోనేరు శ్రీథర్, వైఎస్సార్సీపీ నాయకుడు కోనేరు రాజేంద్రప్రసాద్, ఆస్పత్రి ఎండీ డాక్టర్ పీవీ రమణమూర్తి, చీఫ్ న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి, కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు.