నన్ను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తా..
యువతికి వేధింపులు
అర్ధరాత్రి ఆమె పని చేసే ఇంట్లోకి ప్రవేశించి హంగామా
హైదరాబాద్: ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్న ఓ యువకుడు... అర్ధరాత్రి పూట ఆమె పని చేసే ఇంట్లోకి ప్రవేశించి హంగామా సృష్టించాడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్ నివాసి వినోద్‌సింగ్ కొంత కాలంగా జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో పని చేస్తున్న యువతి వెంటపడి ప్రేమించాలని వేధిస్తున్నాడు. ఆమెకు తరచూ ఫోన్ చేసి మానసిక క్షోభకు గురి చేస్తున్నాడు. బాధితురాలు ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పి.. మూడు రోజులుగా పనికి వెళ్లకుండా తన ఇంట్లోనే ఉంటోంది. వినోద్ ఫోన్ చేస్తే తల్లిదండ్రులు తనకు పెళ్లి చేయబోతున్నారని, ప్రేమ పేరుతో తనను వేధించవద్దని స్పష్టం చేసింది.
తనను కాదని ఎవరిని పెళ్లి చేసుకున్నా.. పెళ్లికొడుకుతో పాటు నిన్నుకూడా చంపేస్తానని అతను యువతిని హెచ్చరించాడు. దీంతో బాధితురాలు తన ఫోన్ స్విచ్చాఫ్ చేయడంతో ఆగ్రహానికి గురైన వినోద్ ఆదివారం అర్ధరాత్రి ఆమె పని చేసే ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించాడు. యువతి ఉండే గది వద్దకు వెళ్లి తచ్చాడుతుండగా ఇంటి యజమాని గమనించి అక్కడికి వెళ్లే లోపు పరారయ్యాడు. విషయాన్ని యజమాని బాధిత యువతి దృష్టికి తీసుకెళ్లగా ఆమె సోమవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేమపేరుతో తనను వేధిస్తున్న వినోద్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.