వినుకొండ రషీద్ కుటుంబానికి సర్కార్ వేధింపులు
పల్నాడు, సాక్షి: ప్రతీకార రాజకీయాలతో ఆ కుటుంబం ఇదివరకే ఓ కొడుకును పొగొట్టుకుంది. ఇప్పుడు అదే రాజకీయానికి మరో కొడుకును జైలుపాలు చేసుకుంది. వినుకొండలో దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోంది. రషీద్ సోదరుడితో పాటు ఆ కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించింది. వినుకొండ రషీద్ కుటుంబాన్ని చంద్రబాబు ప్రభుత్వం కక్షగట్టి వేధిస్తోంది. రషీద్ హత్య కేసులో న్యాయం అందించకపోగా.. అతని సోదరుడు ఖాదర్ బాషా తో పాటు కొంతమంది వైఎస్సార్సీపీ నేతలపై స్థానిక పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. రెండున్నరేళ్ల క్రితం బుల్లెట్ దహనం ఘటనలో.. మూడు వారాల కిందట కేసు నమోదు చేసి మరీ అరెస్టులు చేశారు వినుకొండ పోలీసులు. అయితే.. రషీద్ హత్య కేసులో ‘పరారీలో ఉన్న నిందితుడి’ ఫిర్యాదు ఆధారంగానే ఈ అరెస్టులు జరిగాయి. బుల్లెట్ దహనం బదులుగా ఏకంగా ఇల్లు తగలబెట్టారని పేర్కొంటూ కొత్త సెక్షన్ చేర్చి మరీ ఖాదర్ బాషా, ఇతరులను అరెస్ట్ చేయడం గమనార్హం. 2020లో చనిపోయిన సయ్యద్ బాషా పేరును ఈ కేసులో పోలీసులు చేర్చడం ఇంకో కొసమెరుపు. రషీద్ కుటుంబాన్ని ప్రభుత్వం ఒక పథకం ప్రకారం వేధిస్తోందని అడ్వొకేట్ ఎంఎం ప్రసాద్ అంటున్నారు. రషీద్ హత్య కేసులో ఈయనే వాదనలు వినిపిస్తున్నారు. ‘రషీద్ హత్య కేసులో ఆరో నిందితుడు షేక్ జానీ బాషాను ఇంతదాకా అరెస్టు చేయలేదు. ఇంతలోపు.. 2022లో జరిగిన ఘటన ఆధారంగా అదే షేక్ జానీ బాషా ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రషీద్ సోదరుడు ఖాదర్ బాషాను ఈ కేసులో అక్రమ సెక్షన్లు పెట్టి జైలుకు పంపారు. అలాగే.. ఈ కుటుంబానికి అండగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపారు’’ అని ఎంఎం ప్రసాద్ అంటున్నారు..రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్సార్సీపీ పల్నాడ్ లీగల్ సెల్ అధ్యక్షురాలు రోళ్ళ మాధవి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పోలీసుల అక్రమ కేసులు బనాయిస్తున్నారు. టీడీపీ నేత రషీదును హత్య చేస్తే.. ఆయన సోదరుడ్ని అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారు. తన తమ్ముడి కేసులో న్యాయపోరాటం చేస్తున్న ఖాదర్ భాషాను అక్రమ కేసు బనాయించి జైలుకు పంపడం దారుణం. ఇది కూటమి ప్రభుత్వం కాదు కుతంత్రాల ప్రభుత్వం. ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసులు అక్రమార్కులకు వంతపలుకుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని మండిపడ్డారు. ఒక కొడుకును నడిరోడ్డు పైన చంపేశారు మరొక కొడుకును అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారు. ఇది ప్రభుత్వమే నా?. రషీద్ హత్య కేసులో ఇప్పటికీ కొంతమందిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదు. రషీద్ హత్య కేసులో నిందితుడు షేక్ జానీ బాషా ఫిర్యాదు ఇచ్చాడని అక్రమ కేసు నమోదు చేసి నా పెద్ద కొడుకును జైలుకు పంపారు. రషీద్ హత్య కేసులో నిందితుడు షేక్ జానీ బాషా ఎక్కడున్నాడు?. పోలీసులేమో జానీ బాషా పారిపోయాడని చెప్తున్నాడు. మరి అందరూ చూస్తుండగానే ఆయన చంద్రబాబును కలుస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. మాకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం నా కొడుకుని జైలుకు పంపి మమ్మల్ని వేధిస్తోంది. ::రషీద్ తల్లి శంషాద్ ఆవేదన