విశాఖ డెయిరీ డైరెక్టర్‌పై బాంబులతో దాడి
తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు
బుచ్చియ్యపేట: విశాఖ డెయిరీ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ మండల నాయకుడు గేదెల సత్యనారాయణపై గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి నాటు బాంబులతో దాడి చేశారు. విశాఖ జిల్లా బుచ్చియ్యపేట మండలం కోమర్లపూడి గ్రామానికి చెందిన సత్యనారాయణ ఆదివారం నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా మండలంలోని గంటికొర్లాం పెద్దగొట్టు చెరువు వద్ద పనులు చేయిస్తున్నారు. ఆదివారం రాత్రి 8 గంటలు సమయంలో ఫోన్లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా గుర్తుతెలియని వ్యక్తులు నాటు బాంబులు వేసి అక్కడ నుంచి పరారయ్యారు.
తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న ఆయనను స్థానికులు రావికమతంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. దాడి విషయం తెలుసుకున్న చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు హూటాహుటిన రావికమతం చేరుకొని సత్యనారాయణను తన కారులో విశాఖపట్నం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పాతకక్షలే కారణమా.. లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే విషయాలు తెలియరాలేదు. ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని బుచ్చియ్యపేట ఎస్ఐ ధనుంజయ్ తెలిపారు.