మన్యం రోగాల మయం!
–పట్టించుకోని ప్రభుత్వం
–కొనసాగుతున్న చావులు
–అదుపులోకి రాని వ్యాధులు
సాక్షి, విశాఖపట్నం : విశాఖ మన్యం రోగాలతో అల్లాడిపోతోంది. మలేరియా, డయేరియా, డెంగీ, టైఫాయిడ్ జ్వరాలతో పాటు మాతాశిశు మరణాలతో తల్లడిల్లుతోంది. ఎపిడమిక్ సీజను మొదలైన్పట్నుంచి నిత్యం ఎక్కడోచోట వ్యాధులతో చావు డప్పు మోగుతూనే ఉంది. గత ఏడాదికంటే మలేరియా తగ్గుముఖం పట్టిందని వైద్య ఆరోగ్యశాఖ లెక్కలు కడుతోంది. అయినా మన్యంలో మలేరియా మరణాలు ఆగడం లేదు. అవి చాలవన్నట్టు అతిసార చావులూ వెంటాడుతున్నాయి. మునుపటికంటే ఈ ఏడాది మాతాశిశు మరణాలూ అధికమయ్యాయి. ఒక్క డుంబ్రిగుడ మండలంలోనే ఇటీవల వారం రోజుల వ్యవధిలోనే అప్పుడే పుట్టిన నలుగురు శిశువులు మత్యువాతపడ్డారు. ఏప్రిల్–జులై మధ్య 15 మంది బాలింతలు, 113 మంది పసికందులు అశువులు బాశారంటే ఏజెన్సీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మన్యంలో చాలా ప్రభుత్వాస్పత్రుల్లో సరిపడినంతమంది వైద్యులు, వైద్య సిబ్బంది లేరు. దోమల బారి నుంచి రక్షణ కల్పించే దోమతెరలనూ ఏళ్ల తరబడి సరఫరా చేయడం లేదు. నివేదికలు పంపుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. వీటికోసం రాష్ట్ర ప్రభుత్వమూ కేంద్రంపై ఒత్తిడి చేయడం లేదు. దోమలను నియంత్రించే మందు పిచికారీ పనుల్లోనూ అలసత్వమే నెలకొంది. తొలివిడత స్ప్రేయింగ్ చేసిన సిబ్బందికి కూలీ సొమ్ము ఇప్పటికీ చెల్లించకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. గడచిన ఏడు నెలల్లో ఏజెన్సీలో నాలుగున్నర లక్షల మందికి జ్వరాల సోకినట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఇందులో 4,500కు పైగా మలేరియా రోగులే. ఇక లెక్కల్లోకి ఎక్కని వారెంతమందో ఊహించవచ్చు. మలేరియా జ్వరాలను అదుపు చేసేందుకిచ్చే మందుల పంపిణీ కూడా అరకొరగానే ఉంది. ఈ ఏడాది మన్యంలో అనేక గ్రామాల్లో డయేరియా తీవ్రరూపం దాల్చింది. దీనిబారినపడి పెద్దసంఖ్యలో గిరిజనులు మత్యువాతపడ్డారు.. పడుతున్నారు. అనధికార లెక్కల ప్రకారం వీరి సంఖ్య 25కు పైగానే ఉందని చెబుతున్నారు.
మరోవైపు ఏజెన్సీలో రోగాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటామని, మంత్రుల నుంచి ముఖ్యమంత్రి దాకా బాకా ఊదుతూనే ఉన్నారు. మన్యంలో వైద్యసేవల మెరుగుకు ఆగస్టుకల్లా 30 సంచార వైద్యశాలలు ఏర్పాటు చేస్తామన్న గిరిజన సంక్షేమమంత్రి రావెల కిషోర్‌బాబు హామీ, వ్యాధుల అదుపునకు సంచార వైద్యశాలల సిబ్బంది, సీహెచ్‌సీల్లో ఇద్దరేసి వైద్యుల నియామకాలు చేపడ్తామన్న జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి సరోజిని ప్రకటనలు కార్యరూపం దాల్చలేదు. ముఖ్యమంత్రో, ఇతర మంత్రులో వచ్చినప్పుడు మాత్రం ప్రభుత్వ యంత్రాంగం హడావుడి చేసేసి చేతులు దులుపేసుకుంటోంది.
డాక్టర్లు, వైద్యసిబ్బంది కొరత..
ఏజెన్సీ ఆస్పత్రులలో డాక్టర్లు, వైద్యసిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. పాడేరు, అరకులోయ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రుల్లో ప్రారంభం నుంచి గైనకాలజిస్టులు, చిల్డ్రన్ స్పెషలిస్టులు అందుబాటులో లేరు. దీంతో మాతా శిశు మరణాల నియంత్రణ కొరవడింది. ప్రా«థమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ వైద్యుల కొరత కొనసాగుతోంది. 53 డాక్టర్ పోస్టులకు 28 మంది మాత్రమే ఉన్నారు. ఈ ఏడాది వీరిలో 12 మందికి బదిలీ కాగా 21 మంది కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్నారు. పీహెచ్‌సీల్లో మందులిచ్చేవారే కరువయ్యారు. 25 ఫార్మసిస్ట్ పోస్టులు ఖాళీలు భర్తీ కాలేదు.
104.. పట్టించుకోరు..
ఇక సంచార వైద్య (104) సేవలందిస్తామని ఉదరగొడుతున్న ప్రభుత్వం వాటి ద్వారా ఆ సేవలు తూతూమంత్రంగానే అందిస్తోంది.. ఏటా రూ.2 కోట్లు దీనికి కేటాయిస్తున్నా అక్కరకు రావడం లేదు. ఈ సంచార వైద్య సేవల్లో నిర్వహించే వైద్య శిబిరాలకు వైద్యులే డుమ్మా కొడుతుంటే చోద్యం చూస్తోంది. సగటున 60 శాతం మాత్రమే వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. వీటికి కేవలం 17 శాతానికి మించి వైద్యులు హాజరు కావడం లేదు. వ్యాధుల సీజనులో వీటి సేవలెంతో కీలకం. కానీ ఈ సంచార సేవలు ఎప్పటిలాగానే మొక్కుబడిగా సాగుతున్నాయి.
అతిసారకు 25 మంది బలి
నెల రోజుల వ్యవధిలో ఇప్పటికి మన్యంలో 25 మంది వరకు మత్యువాత పడ్డారు. పాడేరు మండలం వంతాడపల్లి పంచాయతీ నారింగ్బాడి గ్రామంలో ముగ్గురు, మినుములూరు పంచాయితీ సల్దిగెడ్డ గ్రామంలో ఒకరు, హుకుంపేట మండలం అడ్డుమండలో ఐదుగురు, డూరువీధిలో ఒకరు, నిమ్మలపాడులో ఐదుగురు గిరిజనులు, పెదబయలు మండలం కిముడు పల్లి పంచాయితీ అరడగూడెం నలుగురు, పులిగొందిలో ఒకరు, పొదుముబందలో ఒకరు, చింతపల్లి మండలం జల్లూరుమెట్టలో ఒకరు, డుంబ్రిగుడ మండలం జంగిడివలసలో ఒకరు, కొట్రగొందిలో ఒకరు చనిపోయారు.
మరణ మృదంగం ఇలా..
ఫిబ్రవరి 14 నుంచి మార్చి 15 వరకు నెలరోజుల్లో ఏడుగురు విద్యార్థులు మతిచెందారు.
– 14న సూకూరు ఆశ్రమంలో 6వ తరగతి విద్యార్థి ప్రవీణ్‌కుమార్
– 26న తురకలవలస ఆశ్రమ విద్యార్థిని దూరు మణికుమారి
– 28న ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని ఆర్జి లక్ష్మీపార్వతి
– 29న గోమంగి మినీ గురుకులం విద్యార్థిని కిల్లో భవాని
– మార్చి 3న కిలగాడ కస్తూర్భా విద్యార్థిని కె.లక్ష్మి
– 9న పెద్దపేట ఎంపీపీ స్కూల్ విద్యార్థి కొర్రా సుభాష్
– 13న అరడకోట మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల విద్యార్థి కిల్లో పండు.
శిశు మరణాలు
–0 నుంచి 9 నెలలు: 2011–12లో 196, 2012–13లో 303, 2013–14లో 264, 2014–15లో 472, 2015–16 ఫిబ్రవరి వరకు 414
– 2011–12 లో 18, 2012–13 లో 15, 2013–14లో 34, 2014–15లో 36, 2015–16 లో 29 నమోదయ్యాయి.
మలేరియా మరణాలు..
వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నివేదికల ప్రకారం 2010లో 10, 2011లో 4, 2012లో 1 నమోదు కాగా 2013, 2014, 2015 ల్లో మలేరియా మరణాలు నమోదు కాలేదు.