కొల్లాం రైలు ... సీట్లు ఖాళీ
బెర్తులు ఫుల్ మరో మూడు రిజర్వేషన్‌బోగీలు ఏర్పాటు
అయ్యప్ప భక్తులకు భలే రైలు
విశాఖపట్నం : విశాఖ-కొల్లాం రైలుకు భారీ డిమాండ్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఆ రైల్లో సీట్లు ఎందుకు నిండడం లేదనేది రైల్వే అధికారులకు అంతుపట్టడం లేదు. వెయ్యికి పైగా సీట్లు ఉన్న ఈ రైల్లో రైలు బయల్దేరేటప్పుడు ఎటు చూసుకున్నా 800కు పైగా సీట్లు ఖాళీగానే రైలు బయల్దేరుతోందనేది బహిరంగ రహస్యం. ఈ రైల్లో ప్రయాణించేందుకు అయ్యప్ప భక్తులు అన్ని దేవుళ్లకూ మొక్కుతున్నారు. కానీ ఆ రైల్లో అడుగు పెట్టేందుకు సైతం వీలు కుదరడం లేదని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికీ ఆ రైల్లో సీట్లు ఖాళీగా ఉంటున్నా బెర్తులు మాత్రమే చూసుకుని సీట్ల రిజర్వేషన్‌కు వెళ్లడం లేదు. దీంతో ఆ సీట్లన్నీ ఖాళీగానే ఉంటున్నాయి.
చైర్‌కార్ బోగీలే ఎక్కువ..!
విశాఖ నుంచి కొల్లాం(18567) వెళ్లే రైలుకు మొత్తం 23 బోగీలున్నాయి. రెండే రెండు జనరల్ బోగీలు మినహా మిగిలినవన్నీ రిజర్వేషన్ సదుపాయం ఉన్న బోగీలే. ఈ రైల్లో అత్యధికంగా 12 చైర్‌కార్ బోగీల్లో దాదాపు 1072 రిజర్వేషన్ సీట్లు ఉన్నాయి. విశాఖ నుంచి కొల్లాం వేళ్లేందుకు ఒక్కో సీటు రిజర్వేషన్ టికెట్ ధర రూ. 375 మాత్రమే. ఈ మొత్తంతో సీటు రిజర్వేషన్ చేయించుకుని హాయిగా కొల్లాం వెళ్లే అవకాశం ఉంది. కానీ అంతా బెర్తు కోసం ప్రయత్నించి బెర్తులు లేవనగానే మొత్తం రైలంతా నిండిపోయిందన్నంత ప్రచారం చేసి ఈ రైలును ఎవరూ ఎక్కడం లేదు. ఈ రైల్లో బెర్తులున్న రిజర్వేషన్ బోగీలు కేవలం నాలుగు మాత్రమే. సోమవారం నుంచీ మరో మూడు రిజర్వేషన్ బోగీలను అదనంగా వేస్తున్నారు. వీటితో కలిపి మొత్తం 7 రిజర్వేషన్ బోగీలతో ప్రయాణించే అవకాశం ఉంది.
అదనపు బోగీలు
అయ్యప్ప భక్తులకు వాల్తేరు రైల్వే మరి కొన్ని అదనపు బోగీలు కేటాయించింది. డిసెంబర్ మాసం నుంచే ఈ బోగీలు ప్రయాణికుల సేవల్లోకి రానున్నాయి. ఇప్పటికే నాలుగు రిజర్వేషన్ బోగీలతో నడుస్తున్న ఈ రైలుకు మరి కొన్ని అదనపు బోగీలు తోడవడంతో ఉన్న బెర్తులకు తోడుగా మరిన్ని బెర్తులు రానున్నాయి. విశాఖ-కొల్లాం(18567) వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలుకు డిసెంబర్ మూడో తేదీన బయల్దేరే రైలుకు ఒక థర్డ్ ఏసీ, ఒక స్లీపర్ క్లాస్ బోగీలను జత చేయనున్నారు. కొల్లాం నుంచి 4వ తేదీన విశాఖకు బయల్దేరే 18568 రైలులోనూ బోగీలు ఏర్పాటు మార్పు లేకుండా అలాగే ఉంటాయి.
విశాఖ-కొల్లాం(08567) ప్రత్యేక రైలుకు డిసెంబర్ 6వ తేదీన మూడు స్లీపర్ క్లాస్ బోగీలు జత చేస్తున్నారు. డిసెంబర్ 8వ తేదీన బయల్దేరే కొల్లాం-విశాఖ(08568) ప్రత్యేక రైలులోనూ మూడు అదనపు బోగీలుంటాయని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం. ఎల్వేందర్ యాదవ్ ప్రకటించారు.
సీట్లు ఖాళీ ఇలా
ఈ రైల్లో డిసెంబర్ 6వ తేదీన 920 సీట్లు, 13వ తేదీన 1042 సీట్లు, 20వ తేదీన 1013సీట్లు, 27వ తేదీన 1070 సీట్లు, జనవరి 1వ తేదీన 1061 సీట్లు, 10వ తేదీన 1050 సీట్లు చొప్పున ఖాళీలున్నాయి.
టికెట్ ఛార్జీలు ఇలా..
2ఏసీ - రూ.2810
3ఏసీ - రూ.1995
స్లీపర్ - రూ.785
ఛైర్‌కార్ - రూ.375
జనరల్ - రూ.300