విశాఖలో 'ఇజం' ఆవిష్కరించనున్న పవన్
యూత్ ఫర్ ద నేషన్...ఫైట్ ఫర్ ద నేషన్ అనే నినాదంతో ఈ నెల 27న విశాఖపట్నం నగరంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ వెల్లడించింది. ఆదివారం హైదరాబాద్లో జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ సభలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఇజం' పుస్తకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపింది. ఆ సభకు 6 లక్షల మంది యువత హాజరవుతారని పేర్కొంది. జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సోమవారం నుంచి ద్విచక్రవాహన ర్యాలీని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పింది. జనసేన పార్టీ ఐడియాలజీతో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇజం పుస్తకం రాసిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. దేశం నుంచి కాంగ్రెస్ పార్టీని పంపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన ఇటీవల హైదరాబాద్లో జరిగిన పార్టీ ఆవిర్బావ సభలో ప్రకటించిన విషయం విదితమే. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ కాంగ్రెస్సేతర పార్టీలతో జత కట్టేందుకు ప్రయత్నిస్తుంది. అందులోభాగంగా శనివారం గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో సమావేశమైయ్యారు.