శ్రీ వ్రతం సంపదలిచ్చే మాసం సిరులిచ్చే వ్రతం
పన్నిద్దరు ఆళ్వారులలో ఒకరైన విష్ణుచిత్తులవారికి సంతానం లేదు. ఆయన భక్తికి మెచ్చి, సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మీ దేవియే పసిపాపగా ఆయనకు తులసివనంలో దొరికింది. ఆ పాపకు కోద అని పేరు పెట్టి, అల్లారుముద్దుగా పెంచుకున్నాడాయన. కోద అంటే పూలమాల అని అర్థం. పసితనం నుంచి శ్రీ రంగనాథునే చిత్తంలో నిలుపుకుని ఆరాధిస్తున్న కోద యుక్తవయస్కురాలైంది. ఫలితంగా ఆమెకు తన ఆరాధ్యదైవాన్నే పతిగా పొందాలన్న కోరిక కలిగింది. అయితే ఆ మాటను ఆమె తండ్రికి చెప్పలేదు. వచ్చిన సంబంధాలన్నింటినీ తిరస్కరించేది.
ఇది ఇలా ఉండగా స్వామివారికి రకరకాల పూలతో అందమైన మాలకట్టేవాడు విష్ణుచిత్తుడు. మాలలు కట్టే పనిని కోద తనంత తానుగా తండ్రి నుంచి స్వీకరించింది. రోజూ ఆమె తాను కట్టిన మాలను తానే తలలో పెట్టుకుని చూసి మురిసిపోతుండేది. అది తెలియని విష్ణుచిత్తుడు వాటినే స్వామికి సమర్పించేవాడు. ఒకరోజు ఆమె కట్టిన మాలలో పొడవాటి వెంట్రుక కనిపించింది విష్ణుచిత్తునికి. దాంతో అనుమానం వచ్చి కూతురిని నిలదీశాడు. తాను చేసిన పనిని అంగీకరించింది కోద. అపరాధభావనతో విష్ణుచిత్తుడు ఆ రోజు కట్టిన మాలను స్వామికి సమర్పించలేదు.
అంతేకాదు, ఆ రోజు పూజ కూడా సరిగా చేయలేకపోయాడు. వ్యాకులచిత్తంతో ఉన్న విష్ణుచిత్తునికి కలలో శ్రీ రంగనాథుడు కనిపించి, కోద ధరించిన పూలమాల అంటే తనకెంతో ఇష్టమని చెప్పి, ఇకముందు కూడా ఆమె ధరించిన తర్వాతనే తాను పూలమాలను స్వీకరిస్తానని చెప్పాడు. నిద్ర మేలుకొన్న విష్ణుచిత్తుడు జరిగినదంతా కుమార్తెకు చెప్పాడు. అంతవరకూ తెలియక చేసిన పనిని సాక్షాత్తూ శ్రీరంగనాథుడే మెచ్చుకునేసరికి తానంటే స్వామికి కూడా ఇష్టమేమోననే భావన కలిగి కోదకు సిగ్గుతో చెంపలు కెంపులయ్యాయి.
ఆ రోజు స్వామిని తలచుకుంటూ కలతనిద్రపోయింది. ఆ నిద్రలో తాను రంగనాథుని వివాహం చేసుకున్నట్లు అద్భుతమైన కల కనింది. ఆ కలను సాఫల్యం చేసుకునేందుకు ఒక వ్రతం చేయాలని ఆమె సంకల్పించింది. ఆ వ్రతమే శ్రీవ్రతం.
నైమిశారణ్యంలో సూతమహాముని శౌనకాది మునులకు ఈ వ్రతవిధానం బోధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీవ్రతాన్ని ధనుస్సంక్రమణం మొదలు మకర సంక్రమణం వరకు ఆచరించాలి. దీనినే గోపికలు కాత్యాయనీ వ్రతంగా ఆచరించి శ్రీకృష్ణుని భర్తగా పొందారని పురాణ వచనం.
ఇదీ ఈ వ్రతవిధానం
సూర్యుని కన్నా ముందే నిద్ర మేల్కొనాలి. నిత్యకర్మలను పూర్తి చేసుకుని ఈ వ్రతంపై శ్రద్ధఉంచి విష్ణువును పూజించాలి. అందుకోసం శక్తిమేరకు ఒక ప్రతిమను తయారు చేయించి, దానికి మధుసూదనుడు అని పేరు పెట్టి అర్చామూర్తిగా నిలపాలి. ఈ విగ్రహంలోనికి నారాయణుని ఆవాహన చేసి, షోడశోపచారాలతో పూజించాలి. విగ్రహ ప్రతిష్ఠాపన చేసింది మొదలు ప్రతిరోజూ పంచామృతస్నానం చేయించాలి. తులసీదళాలతో అలంకరించాలి.
అష్టోత్తర శత నామాలతో అర్చనచేయాలి. నైవేద్యంగా నెయ్యి ఓడేలా బియ్యం, పెసరపప్పు సమపాళ్లలో తయారు చేసిన పప్పు పొంగలిని సమర్పించాలి. మొదటి పదిహేను రోజులూ ముద్గాన్నాన్ని అంటే పప్పు పొంగలిని, తరువాతి పదిహేనురోజులూ దానితోబాటు దధ్యోదనాన్ని నివేదించాలి. చివరిగా మంత్రపుష్ప, నీరాజనాదులిచ్చి, ఆత్మ ప్రదక్షిణ చేసి, తీర్థప్రసాదాలను స్వీకరించాలి.
ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాచరణ చేసిన కోద రోజుకో పాశురంతో స్వామిని స్తుతించేది. ఆమె భక్తికి మెచ్చిన రంగనాథుడు ఆమెను పత్నిగా స్వీకరించాడు. ఆమే ఆండాల్.
- డి.వి.ఆర్. భాస్కర్
వ్రతనియమాలేమిటి?
ఈ వ్రతమంతటినీ సూర్యోదయానికి పూర్వమే పూర్తిచేయడం ఉత్తమం. ఆవునేతితో వెలిగించిన అఖండదీపం శ్రీహరికి అత్యంత ప్రీతికరం. ఈనెలరోజులూ శ్రీహరి చరితామృతాన్ని వినాలి. గానం చేయాలి. తులసి, గోపూజలు చేయాలి. విష్ణుపురాణ పఠనం, శ్రవణం శుభఫలితాలనిస్తుంది.
అర్హతలేమిటి?
నియమాలను పాటించేందుకు ఇష్టపడే ప్రతి ఒక్కరు ఈ వ్రతాన్ని ఆచరించేందుకు అర్హులే. భక్తి, శ్రద్ధ, ఆసక్తి ఉంటే ఇంటిలోనే వ్రతాన్ని ఆచరించవచ్చు. అందుకు కుదరనివారు సమీపంలోని ఏదైనా దేవాలయంలోగాని, భాగవతోత్తముల ఇండ్లకు వెళ్లిగాని ఆచరించవచ్చు. ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.
ప్రయోజనాలేమిటి?
వివాహం కాని వారు ఈ మార్గళీ వ్రతాన్ని ఆచరిస్తే శీఘ్రంగా వివాహమవుతుందని, సౌభాగ్యవతులు వ్రతాచరణ చేసి తమ సంసారంలోని చిక్కులను రూపుమాపుకోవచ్చునని, భగవంతునిపై భక్తితో వ్రతాచరణ చేస్తే శారీరక, మానసిక రుగ్మతలు తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయని ఫలశ్రుతి చెబుతోంది.