చిన్నారిని మింగిన నీటి తొట్టె
అగళి : అగళి పోలీస్స్టేషన్ సమీపంలో నివాసముంటున్న భజంత్రి అశ్వత్థప్ప మనవడు విష్ణుకుమార్(2) బుధవారం ఉదయం నీటి తొట్టెలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అశ్వత్థప్ప తన కుమార్తె శశికళను ఆరేళ్ల కిందట హిందూపురానికి చెందిన రామప్పకు ఇచ్చి వివాహం చేశారు. మొదటి కాన్పులో విష్ణు జన్మించగా, ఇప్పుడామె రెండో కాన్పుకు పుట్టింటికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంటి ఆవరణలో ఆడుకుంటూ నీటి తొట్టెలోకి విష్ణుకుమార్ కాలుజారి పడిపోయాడన్నారు.
తల్లి చూసి గట్టిగా కేకలు వేయగా, చుట్టుపక్కల వారు వచ్చి చిన్నారిని బయటకు తీసి వెంటనే పీహెచ్సీకి తరలించారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో శిరా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించినట్లు వివరించారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వైద్యులు అందుబాటులో ఉండి ఉంటే ఆ బిడ్డ బతికేవాడని స్థానికులు తెలిపారు.