పొగమంచుతో పెరిగిన వాహన ప్రమాదాలు
చలికాలంలో పొగమంచు రోడ్డు ప్రమాదాలకు కారణంగా మారుతోంది. విజిబులిటీ తగ్గిన కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పొగమంచు కారణంగా యూపీలోని ఆగ్రాలో పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బహ్రైచ్-బలరాంపూర్ హైవేపై డబుల్ డెక్కర్ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రైవేట్ బస్సు గుజరాత్ నుంచి బలరాంపూర్ జిల్లా వైపు వెళ్తోంది. ఈ క్రమంలో బహ్రైచ్-బలరాంపూర్ హైవేలోని ధరస్వాన్ గ్రామం సమీపంలో బియ్యం లోడుతో వస్తున్న ట్రక్కును డబుల్ డెక్కర్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు.
హాపూర్లో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి-9పై సుమారు 15 వాహనాలు ఒక్కొక్కటిగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం కారణంగా రోడ్డుపై చాలాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు ఆగ్రాలోనూ పొగమంచు కారణంగా రోడ్డుపై డ్రైవింగ్ ఇబ్బందికరంగా మారింది. పొగమంచు కారణంగా పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన జాతీయ రహదారిలోని ఎత్మాద్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
సిద్ధార్థనగర్లోనూ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బన్సీ కొత్వాలి పరిధిలోని బెల్బన్వా గ్రామంలో ఒక పికప్ వాహనం, బైక్ ఢీకొన్నాయి. పశువులను తప్పించబోయిన పికప్ వాహనం బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. కాగా పికప్ వాహనంలో అక్రమంగా పశువులను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించి, వాటిని గోశాలకు తరలించారు. ఈ ఉదంతంలో ఇద్దరి అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. పికప్ వాహనాన్ని సీజ్ చేశారు.
ఇది కూడా చదవండి: హిమాచల్కు టూరిస్టుల తాకిడి!