విమాన టిక్కెట్లు మళ్లీ భగ్గుమంటాయా...?
న్యూఢిల్లీ : విమాన ప్రయాణికులకు ఈ పండుగ కాలంలో ధరలు మరింత ప్రియమవనున్నాయా? అంటే అవుననే అనిపిస్తుంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) లేదా జెట్ ఫ్యూయల్ విమానాల ఆపరేటింగ్ ఖర్చుల్లో 40శాతం నమోదయ్యాయట. 9.2శాతం ఈ ధరలు పెరిగినట్టు రిపోర్టులు చెబుతున్నాయి. ఇలా జెట్ ఫ్యూయల్ ధరలు పెరగడం వరుసగా నాలుగో సారి. గత మూడు నెలల్లో ఆపరేటింగ్ ఖర్చుల్లో ఈ ధరలు 35శాతంగా నమోదయ్యాయి. ఇండియాలో అతిపెద్ద ఎయిర్ పోర్టు ఢిల్లీలో ఏటీఎఫ్ ధరలు దేశీయ విమానాల్లో కిలో లీటర్ కు రూ. 46,729గా ఉన్నాయి. అయితే ఫ్యూయల్ ధరల పెరుగుదల ఎంతమేరకు టిక్కెట్ ధరల పెరుగుదలపై ప్రభావం చూపనుందో విమాన సంస్థలు ప్రకటించలేదు. ఫెస్టివల్ సీజన్ లో డిమాండ్, ఫ్యూయల్ ధరల పెరుగుదలకు అనుగుణంగా టిక్కెట్ ధరలు ఎగబాకడానికి దోహదం చేస్తాయని తెలుస్తోంది.
ఏప్రిల్ మధ్య కాలం నుంచి జూలై వరకూ పీక్ ట్రావెల్ సీజన్ నడుస్తుందని, ఈ కాలంలో చాలా టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడుపోయినట్టు విమాన పరిశ్రమ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. జూలై కు - సెప్టెంబర్ కు మధ్య ఎయిర్ లైన్స్ టిక్కెట్లకు చాలా సంస్థలు డిస్కౌంట్లు కూడా ఆఫర్ చేస్తున్నాయి. కేవలం ఇన్ ఫుట్ ధరల ప్రకారమే విమాన సంస్థలు ధరలు నిర్ణయించవని, పోటీతత్వం, డిమాండ్ సప్లై బ్యాలెన్స్ లకు అనుగుణంగా ధరలు పెంచుతాయని విస్తారా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజివ్ కపూర్ తెలిపారు. అయితే ఫ్యూయల్ ధరల పెరుగుదల విమానయాన సంస్థ ధరల విధానంపై ఎక్కువ ప్రభావం చూపుతుందన్నారు.