రేపు వెంకన్న బ్రహ్మోత్సవ అంకుర్పారణ
– ఎల్లుండి ధ్వజారోహణం, శ్రీవారికి సీఎం పట్టువస్త్రాలు సమర్పణ
సాక్షి,తిరుమల: దేవదేవుడు శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం అంకురార్పణ వైదిక కార్యక్రమంతో ఆరంభం కానున్నాయి. తిరుమలేశుని సర్వసేనాధిపతి విష్వక్సేనుడు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లను స్వామి తరుపున విష్వక్సేనుడు పర్యవేక్షించే కార్యక్రమమే ఈ అంకురార్పణ. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం విష్వక్సేనుడు ఛత్రచామర మంగళవాయిద్యాలతో ఊరేగుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించటం ఆలయ సంప్రదాయం. ఆలయంలో అంకుర్పాణ వైదిక పూజలనంతరం బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు.
ధ్వజారోహణం ఎల్లుండి
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సోమవారం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.15 నుంచి 6.30 గంటల్లోపు మీన లగ్నంలో ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించి ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతారు. ఆ తర్వాతే బ్రహ్మోత్సవాల వాహన సేవలకు నాంది పలుకుతారు. అదే రోజు రాత్రి 7.30 గంటలకు సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఆమేరకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది.
ప్రత్యేక ఆకర్షణగా మత్సావతారం సైకత శిల్పం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఇక్కడి కల్యాణవేదికలోని ఫల, పుష్ప ప్రదర్శన శాలలో మశ్చ్యవతార సైకత శిల్పం రూపుదిద్దుకుంటోంది. సుమారు ఏడు టన్నుల ఇసుకతో మైసూరుకు చెందిన సైకత శిల్ప నిపుణులు ఎంఎల్ గౌరి (25), నీలాంబిక (23)తో కలసి సైకత శిల్పాన్ని రూపొందించే ప్రక్రియ ప్రార ంభించారు. శనివారం నాటికి పూర్తి స్థాయిలో ఆకృతితో ఈ సైకత శిల్పం భక్తులకు కనువిందు చేయనుంది.