viswendra singh
-
గుజ్జర్ల ఆందోళన హింసాత్మకం
జైపూర్: ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు విద్యాసంస్థల్లో 5 శాతం రిజర్వేషన్ కోరుతూ రాజస్తాన్లో గుజ్జర్లు ప్రారంభించిన ఆందోళన మూడో రోజైన ఆదివారం హింసాత్మకంగా మారింది. రాజస్తాన్ మంత్రి విశ్వేంద్ర సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రతినిధుల బృందం గుజ్జర్లతో జరిపిన చర్చలు సఫలం కాని నేపథ్యంలో ధోల్పూర్ జిల్లాలో ఆందోళనకారులు ఆగ్రా–మొరేనా రహదారిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా కొందరు గుర్తుతెలియని దుండగులు తుపాకీతో 8–10 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆందోళనకారులు 3 పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీస్ సిబ్బందిపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపైకి బాష్పవాయువును ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అల్లర్లు వ్యాపించకుండా ధోలాపూర్, కరౌలీ జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. మరోవైపు ఆందోళనకారులు వేర్వేరు నగరాల్లో జాతీయ రహదారులపై బైఠాయించారు. ఈ నేపథ్యంలో ఆందోళనలను నిలిపివేసేందుకు గుజ్జర్ ఆరక్షన్ సంఘర్షణ్ సమితి చీఫ్ కిరోరీ సింగ్ బైంస్లా నిరాకరించారు. రైకా–రెబారీ, గడియా లుహార్, బంజారా, గదరియా, గుజ్జర్ సామాజికవర్గాలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 5 శాతం రిజర్వేషన్ కల్పించేవరకూ వెనక్కు తగ్గబోమని స్పష్టం చేశారు. కాగా, ఆందోళనకారులు రైలు పట్టాలపై ధర్నాకు దిగడంతో రాజస్తాన్లో 20 సర్వీసులను అధికారులు రద్దుచేశారు. ఈ ప్రాంతంలో మరో 250 రైళ్లను దారి మళ్లించారు. కాగా, గుజ్జర్ల ఆందోళనలోకి సంఘవిద్రోహక శక్తులు చొరబడ్డాయని సీఎం అశోక్ గెహ్లోత్ ఆరోపించారు. -
రాజు గారికి కోపం వచ్చింది!
ఆయనో మాజీ రాజుగారు. అంతేకాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా. బ్యాంకుకు వెళ్లి డబ్బులు తీసుకోవాలనుకున్నాడు. ఆయన అనుకున్నంత మొత్తం రాలేదు. అంతే, ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చింది. నేరుగా పోలీసు స్టేషన్కు వెళ్లి రిజర్వు బ్యాంకు గవర్నర్ ఊర్జిత్ పటేల్ మీద ఓ కేసు పెట్టేశారు! ఈ ఘటన రాజస్థాన్లో జరిగింది. విశ్వేంద్ర సింగ్ (54) బ్యాంకు నుంచి రూ. 10వేలు తీసుకోవాలనుకున్నారు. ఇందుకోసం ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్కు వెళ్లారు. దాదాపు గంటసేపు వేచి ఉండాల్సి వచ్చింది. ఆయన వంతు వచ్చిన తర్వాత.. అప్పటికే చాలా నగదు అయిపోవడంతో, పదివేలు ఇవ్వడం కష్టమని, బ్యాంకులో కేవలం రూ. 3 లక్షలు మాత్రమే ఉన్నాయని.. అందువల్ల మిగిలినవారికి ఇవ్వడానికి వీలుగా 2వేల రూపాయలు ఇస్తామని చెప్పారు. దాంతో విశ్వేంద్రసింగ్కు ఎక్కడ లేని కోపం వచ్చింది. రిజర్వు బ్యాంకుకు పెద్దనోట్ల రద్దు గురించి తెలిసినప్పుడు.. వాళ్లు ఎందుకు తగినన్ని నోట్లు ముద్రించలేదని ప్రశ్నించడమే కాక.. నేరుగా పోలీసు స్టేషన్కు వెళ్లి రిజర్వు బ్యాంకు గవర్నర్ మీద, తనను నిరుత్సాహపరిచిన బ్యాంకు మేనేజర్ మీద చీటింగ్ కేసు పెట్టారు. పోలీసులు తన ఫిర్యాదు తీసుకున్నా, ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదని, దీన్ని తాను ఇంతటితో వదలకుండా కోర్టుకు తీసుకెళ్తానని చెప్పారు. తగిన దర్యాప్తు చేసిన తర్వాత తాము దీనిపై ఎఫ్ఐఆర్ దాఖలుచేస్తామని పోలీసులు అన్నారు.