జైపూర్: ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు విద్యాసంస్థల్లో 5 శాతం రిజర్వేషన్ కోరుతూ రాజస్తాన్‌లో గుజ్జర్లు ప్రారంభించిన ఆందోళన మూడో రోజైన ఆదివారం హింసాత్మకంగా మారింది. రాజస్తాన్ మంత్రి విశ్వేంద్ర సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రతినిధుల బృందం గుజ్జర్లతో జరిపిన చర్చలు సఫలం కాని నేపథ్యంలో ధోల్‌పూర్ జిల్లాలో ఆందోళనకారులు ఆగ్రా–మొరేనా రహదారిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా కొందరు గుర్తుతెలియని దుండగులు తుపాకీతో 8–10 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆందోళనకారులు 3 పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీస్ సిబ్బందిపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపైకి బాష్పవాయువును ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
అల్లర్లు వ్యాపించకుండా ధోలాపూర్, కరౌలీ జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. మరోవైపు ఆందోళనకారులు వేర్వేరు నగరాల్లో జాతీయ రహదారులపై బైఠాయించారు. ఈ నేపథ్యంలో ఆందోళనలను నిలిపివేసేందుకు గుజ్జర్ ఆరక్షన్ సంఘర్షణ్ సమితి చీఫ్ కిరోరీ సింగ్ బైంస్లా నిరాకరించారు. రైకా–రెబారీ, గడియా లుహార్, బంజారా, గదరియా, గుజ్జర్ సామాజికవర్గాలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 5 శాతం రిజర్వేషన్ కల్పించేవరకూ వెనక్కు తగ్గబోమని స్పష్టం చేశారు. కాగా, ఆందోళనకారులు రైలు పట్టాలపై ధర్నాకు దిగడంతో రాజస్తాన్‌లో 20 సర్వీసులను అధికారులు రద్దుచేశారు. ఈ ప్రాంతంలో మరో 250 రైళ్లను దారి మళ్లించారు. కాగా, గుజ్జర్ల ఆందోళనలోకి సంఘవిద్రోహక శక్తులు చొరబడ్డాయని సీఎం అశోక్ గెహ్లోత్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment