పోలవరం ఘనత వైఎస్‌దే
ఉరవకొండ : దేశంలో నదుల అనుసంధానంతో కరువును తరిమికొట్టాలన్న మహోన్నత లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అనుమతులు సాధించారని, పోలవరం ఘనత ఆయనకే దక్కుతుందని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. గడప గడపకు వైఎస్ఆర్లో భాగంగా గురువారం స్థానిక గాంధీచౌక్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరానికి వైఎస్ హయాంలో 2వేల కోట్లు ఖర్చు పెడితే, చంద్రబాబు మూడేళ్లలో కేవలం కేంద్రం నుంచి నాబార్డు నిధులు రూ.1900 కోట్ల రుణాన్ని మాత్రమే తీసుకొచ్చారన్నారు.
నాబార్డు రుణాన్ని తీసుకొచ్చి చంద్రబాబు ఇతర నాయకులు స్వీట్లు పంచుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. విభజన చట్టంలోని అంశాలకు ఆధారంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రజలు ఒత్తిడి మేరకు పోలవరానికి నాబార్డు రుణం మంజురైందన్నారు. ప్రభుత్వం జనవరి 2 నుంచి నిర్వహించే జన్మభూమి సభలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌కార్డులు, పింఛన్లు, ముఖ్యంగా ఇంటి పట్టాలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సభలను ప్రజలు బహిష్కరించడం ఖాయమన్నారు. వైఎస్ హయంలో పేదలకు 40లక్షలు ఇళ్లు నిర్మించి ఇస్తే, చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండున్నరేళ్లలో ఒక్క సెంటు స్థలం కానీ, ఇళ్లు కానీ మంజురు చేసినా పాపాన పోలేదన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు అద్యాపకులు తమ న్యాయ పరమైన డిమాండ్ల కోసం సమ్మె చేపడుతుంటే చంద్రబాబు దుర్మార్గంగా వారిని బెదిరిస్తూ విధుల్లోకి రావాలంటూ నోటీసులు జారీ చేయడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం వెంటనే గతంలో టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టో లో వున్న కాంట్రాక్టు అద్యాపకులను రెగ్యూలర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు తిప్పయ్య, లలితమ్మ, రాష్ట్ర కార్యదర్శి బసవరాజు ఉన్నారు.