లీజు ఒప్పందాలపై స్టాంపు డ్యూటీ తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: హేతుబద్ధీకరణలో భాగంగా పలు రకాల లీజు ఒప్పందాలపై స్టాంపు డ్యూటీని ప్రభుత్వం తగ్గించింది. ఇది గురువారం నుంచి అమల్లోకి రానుంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య కార్యదర్శి వీకే అగర్వాల్ బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి...
ఏడాది లోపు గడువున్న లీజు ఒప్పందాల రిజిస్ట్రేషన్‌కు ప్రస్తుతమున్న 4% స్టాంపు డ్యూటీలో ఎలాంటి మార్పూ లేదు
ఏడాది నుంచి 5 ఏళ్ల లోపు లీజు ఒప్పందాల రిజిస్ట్రేషన్‌కు నివాస భవనాలకైతే ప్రస్తుతం మొత్తం అద్దెలో 0.4 శాతం స్టాంపు డ్యూటీగా ఉంది. కానీ ఇకపై వార్షిక సగటు అద్దెలో 0.5 శాతం చెల్లిస్తే సరిపోతుంది. నివాసానికి కాకుండా ఇతర అవసరాలకు తీసుకున్న లీజు ఒప్పందాలకు సగటు వార్షిక అద్దెలో 1 శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాలి.
5 నుంచి 10 ఏళ్ల గడువున్న లీజు ఒప్పందాల రిజిస్ట్రేషన్‌కు నివాస భవనాలకు ప్రస్తుతం మొత్తం అద్దెలో 0.4 శాతం స్టాంపు డ్యూటీ ఉంది. దాన్ని ఇకపై వార్షిక సగటు అద్దెలో 1 శాతం చెల్లించాలి. ఇతర అవసరాలకు చేసుకున్న లీజు ఒప్పందాల రిజిస్ట్రేషన్‌కు వార్షిక సగటు అద్దెలో 2 శాతం చెల్లించాలి.
10 నుంచి 20 ఏళ్ల గడువున్న లీజు ఒప్పందాల రిజిస్ట్రేషన్‌కు ప్రస్తుతం మొత్తం అద్దెలో 0.6 శాతం స్టాంపు డ్యూటీ ఉంది. ఇకపై వార్షిక సగటు అద్దెలో 6 శాతం చెల్లిస్తే సరిపోతుంది.
20 నుంచి 30 ఏళ్ల లీజు ఒప్పందాల రిజిస్ట్రేషన్‌కు ప్రస్తుతం మొత్తం అద్దెలో 0.8 శాతం స్టాంపు డ్యూటీ ఉంది. అదిప్పుడు వార్షిక సగటు అద్దెలో 15 శాతానికి పరిమితం కానుంది.
30 ఏళ్లకు మించిన లీజు ఒప్పందాల రిజిస్ట్రేషన్‌కు ఆస్తి తాలూకు మొత్తం మార్కెట్ విలువలో 5 శాతం లేదా సగటు వార్షిక అద్దెకు 10 రెట్లలో ఏది ఎక్కువైతే అది ప్రస్తుతం అమల్లో ఉంది. ఇకపై లీజు ఒప్పందం చేసుకునే ఆస్తి మార్కెట్ విలువలో 3 శాతం చెల్లించాలి.
మరికొన్ని రకాల ఒప్పందాల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లకు కూడా స్టాంపు డ్యూటీ స్వల్పంగా తగ్గింది