వాలీబాల్ చాంపియన్ నిజామాబాద్
నిజామాబాద్‌స్పోర్ట్స్ : రాష్ట్రస్థాయి అండర్-19 వాలీబాల్ పోటీల్లో నిజామాబాద్ బాలబాలికలు సత్తా చాటారు. సొంతగడ్డపై జరిగిన టోర్నమెంట్లో చాంపియన్‌గా నిలిచారు. అద్భుతమైన ఆటతీరుతో ప్రత్యర్థులను మట్టికరిపించి జయకేతనం ఎగురవేశారు. జిల్లాకేంద్రంలోని కలెక్టర్ గ్రౌండ్లో జరిగిన రాష్ట్రస్థాయి టోర్నీ శుక్రవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలంటే ప్రతిఒక్కరికీ ఇష్టమేనన్నారు. జీవితాంతం ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పాడుతాయన్నారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో నిజామాబాద్ బాలబాలికల జట్లు ప్రథమ స్థానంలో నిలువడం జిల్లా గర్వకారణమన్నారు. ఆటల్లో గెలుపు, ఓటములు సహజంగా ఉంటాయని, ఓడినవారు విజయం కోసం మరింత కృషిచేయాలని సూఇంచారు. తాను చిన్నప్పుడు ఆటలకు దూరమయ్యానని చదువుతోనే బాల్యం గడిచిపోయిందన్నారు.
ఇప్పుడు మాత్రం ప్రతీరోజు టెన్నిస్ ఆడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నానన్నారు. పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు జాతీయస్థాయి టోర్నమెంట్లో తెలంగాణను ప్రథమ స్థానంలో నిలుపాలన్నారు. అనంతరం క్రీడల నిర్వహణ కార్యదర్శి సాయిలు, డీవీఈవో ఒడ్డెన్న, ఆర్ఐవో విజయ్‌కుమార్‌లు మాట్లాడుతూ అండర్-19 రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌ను విజయవంతం చేసినందుకు క్రీడాకారులకు, క్రీడాభిమానులకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. జాతీయస్థాయి టోర్నమెంట్ మహారాష్ట్రలోని కోలాపూర్‌లో త్వరలో జరుగుతుందని, అక్కడ మన రాష్ట్ర జట్టును ప్రథమ స్థానంలో నిలుపాలన్నారు.
టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన జయ హాస్పిటల్ డాక్టర్ ప్రేమానందం, ఎంఎస్ఆర్ స్కూల్ డెరైక్టర్ విక్రమ్‌రెడ్డి, ఎన్‌వైకే కో-ఆర్డినేటర్ రాంచందర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విజేతలకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, డీఎస్డీవో శర్మ, ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి గంగాధర్, పీడీలు మన్నన్, మల్లేశ్‌గౌడ్, శ్రీధర్, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.