హోరాహోరీగా వాలీబాల్ పోటీలు
అమలాపురం / ఉప్పలగుప్తం (అమలాపురం) :గొల్లవిల్లిలో జరుగుతున్న నిమ్మకాయల వెంకట రంగయ్య మెమోరియల్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. రెండోరోజు శనివారం సాయంత్రం ప్రారంభమైన తొలి మ్యాచ్‌లో పోస్టల్ కర్నాటక జట్టుపై సీఆర్పీఎఫ్ ఢిల్లీ జట్టు 25–22, 22–25, 19–25, 25–19, 15–8 పాయింట్లతో గెలుపొందింది. మొత్తం ఐదు సెట్లలో జరిగిన ఈ పోరు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసింది. మహిళా విభాగంలో కర్ణాటక జట్టు సౌత్ సెంట్రల్ రైల్వేపై 27–25, 25–20, 17–25, 25–19 తేడాతో విజయం సాధించింది. ముందు రోజు శుక్రవారం రాత్రి రెండు గంటల వరకూ పోటీలు జరిగిన పోటీల్లో ఆంధ్రా స్పైకర్స్ (ఏపీటీం) జట్టు సాయి గుజరాత్‌పై 25–22, 25–16, 25–21 స్కోర్‌తో గెలుపొందింది. మహిళా విభాగంలో జరిగిన పోరులో పోస్టల్ కర్నాటక జట్టు సీఆర్పీఎఫ్ ఢిల్లీ జట్టుపై 25–19, 25–23, 21–25, 25–18 స్కోర్‌తో గెలుపొందింది. ఒక్కో మ్యాచ్ ఫలితం కోసం నాలుగు, ఐదు సెట్లు ఆడాల్సి రావడంతో పోటీలు ఆలస్యమవుతున్నాయి. సుమారు ఐదువేల మంది సామర్థ్యం ఉన్న గ్యాలరీ నిండిపోవడంతో చాలా మంది బయటే ఉండిపోతున్నారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు, అయితాబత్తుల ఆనందరావులు రెండో రోజు పోటీలను తిలకించారు. వారికి టోర్నమెంట్ అధ్యక్ష, కార్యదర్శులు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు, మద్దింశెట్టి సురేష్ స్వాగతం పలికారు.