స్వచ్ఛ భారత్‌లో ‘తెలంగాణ’ గల్లంతు
కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన జాబితాలో కనిపించని రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్(ఎస్బీఎం) కింద ఎంపిక చేసిన రాష్ట్రాల జాబి తాలో ‘తెలంగాణ’ పేరు గల్లంతైంది. ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్‌ను అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం జాబితాను వెలువరించింది. అయితే తెలంగాణ మిన హా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ జాబితాలో చోటు లభించింది.
ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎంపికైన పట్టణాల సంఖ్య, నిధుల కేటాయింపు తదితర సమాచారం ఈ జాబితాలో ఉంది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ తాజాగా ఈ జాబితాను ప్రకటించింది. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌గా సూచించినట్లు రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 125 పట్టణాల్లో అమలు
దేశ వ్యాప్తంగా 4,041 పట్టణాల్లో స్వచ్ఛ భారత్ పథకం అమ లుకానుండగా..(ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్‌లోని 125 పట్టణాలు కేంద్రం ఎంపిక చేసిన జాబితాలో ఉన్నాయి. ఈ పట్టణాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం పెద్దపీట వేయనుంది.
వ్యక్తిగత మరుగుదొడ్లకు రూ. 4 వేలు: స్వచ్ఛ భారత్ కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం రూ.4 వేల ను ప్రోత్సాహకంగా అందజేయనుంది. తొలి విడత కింద కేంద్ర ప్రోత్సాహకం నుంచి రూ.2 వేలతో పాటు రాష్ట్ర వాటా నిధులను లబ్ధిదారులకు చెల్లిస్తారు. నిర్మాణంలో పురోగతిని పరిశీలించాక మిగిలిన 50 శాతాన్ని అందజేస్తారు. నిర్మాణం పూర్తై మరుగుదొడ్ల చిత్రాలను ఎస్బీఎం వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల ద్వారానే చెల్లింపులు జరుగుతాయి. సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం 40 శాతం, రాష్ట్రం 25 శాతం వాటాను అందిస్తాయి. మిగిలిన నిధులను ఇతర మార్గాల నుంచి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. పట్టణాల్లో అవసరాలకు సరిపడే సంఖ్యలో పబ్లిక్ మరుగుదొడ్లను నిర్మించాలని రాష్ట్రాలకు కేం ద్రం సూచించింది. పబ్లిక్ మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణను పీపీపీ పద్ధతిలో చేపట్టాలని కేంద్రం సూచించింది.