ఓల్వో విస్తరణ
- యూరోప్‌కు ఎగుమతి లక్ష్యం
- 2,125 మందికి ఉద్యోగ అవకాశాలు
- ఆగస్టులో స్వీడన్ పర్యటన
- ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడి
సాక్షి, బెంగళూరు : హొసకోటెలోని ఓల్వో బస్ కార్పొరేషన్ యూనిట్‌ను రూ.975 కోట్లతో విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. స్వీడన్‌కు చెందిన ఓల్వో బస్ కార్పొరేషన్ అధ్యక్షుడు హాకన్ ఆగ్నేవాల్తో మంగళవారమిక్కడి విధానసౌధలోని తన ఛాంబర్లో సిద్ధరామయ్య సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. హొసకోటెలో ఇప్పటికే 150 ఎకరాల్లో ఓల్వో బస్ కార్పొరేషన్ యూనిట్ ఏర్పాటై ఉందని అన్నారు.
ఈ యూనిట్‌ను మరో 90 ఎకరాల్లో విస్తరించేందుకు గాను ఆ సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు. ఈ యూనిట్లో బస్‌లను తయారుచేసి యూరోప్‌కి ఎగుమతి చేసేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తోందని పేర్కొన్నారు. ఈ యూనిట్ విస్తరణ ద్వారా దాదాపు 2,125 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని వెల్లడించారు. ఈ యూనిట్ కనుక అందుబాటులోకి వస్తే దేశంలోనే మొదటి సారిగా బస్‌లను తయారుచేసి యూరోప్‌కు ఎగుమతి చేసే యూనిట్‌ను ఏర్పాటు చేసిన ఘనత కర్ణాటకకు దక్కుతుందని తెలిపారు. ఇక స్వీడన్‌ను సందర్శించాల్సిందిగా ఓల్వో బస్ కార్పొరేషన్ అధ్యక్షుడు హాకన్ ఆగ్నేవాల్ తనను ఆహ్వానించారని, ఆగస్టులో స్వీడన్‌ను సందర్శిస్తానని ఆయనకు హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఓల్వో సంస్థ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ, పరిశ్రమల శాఖ అదనపు ముఖ్యకార్యదర్శి రత్నప్రభా తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని సభకు గైర్హాజరు
ఇక కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భూ స్వాధీన బిల్లుపై ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు(బుధవారం) నిర్వహించనున్న సమావేశానికి తాను హాజరుకావడం లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ప్రధాని ముఖ్యమంత్రులతో నిర్వహించనున్న సమావేశానికి హాజరుకాలేక పోతున్నానని తెలిపారు. తన ప్రతినిధిగా రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రి హెచ్.సి.మహదేవప్పను సమావేశానికి పంపుతున్నట్లు చెప్పారు.