పాలెం బస్సు బాధితుల అరెస్ట్, పీఎస్‌కు తరలింపు
హైదరాబాద్ : అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన మహబూబ్ నగర్ జిల్లా పాలెం వోల్వో బస్సు బాధితులను పోలీసులు మధ్యలోనే అరెస్ట్ చేశారు. మంగళవారం వీరంతా హిమాయత్ నగర్‌లోని ఏఐటీయూసీ కార్యాలయం నుంచి అసెంబ్లీకి బయల్దేరగా.... పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. న్యాయం చేయాలని కోరుతున్న తమను అరెస్ట్ చేయటం అమానుషమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల చర్యను నిరసిస్తూ సీపీఐ నేతలు పోలీస్ స్టేషన్లో బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.
కాగా పాలెం బస్సు ప్రమాద బాధితులు ప్రధానంగా నాలుగు డిమాండ్లతో సినీ నటుడు శివాజీ నేతృత్వంలో నిన్న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిసారు. బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షలు నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, బస్సు యజమాని జేసీ ప్రభాకర్‌పై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ అనుమతులతో ప్రైవేట్ బస్సులు నడిపించాలని వారు ఈ సందర్భంగా బొత్సను కోరారు. బాధితుల డిమాండ్లపై స్పందించిన బొత్స మాట్లాడుతూ బాధితుల డిమాండ్లు తీర్చే అధికారం తనకు లేదని, అయితే తన పరిధిలో న్యాయం చేస్తానని అన్నారు. ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రెండు రోజుల్లో లేఖ రాస్తానని చెప్పారు.