దొంగలెవరు?
ఒంటిమిట్ట పోలీసుస్టేషన్లో దొంగల దర్జా
18 ఎర్రచందనం దుంగలు చోరీ
చోరీపై నోరు మెదపని పోలీసులు
ఎవరికైనా ఏదైనా కష్టమొస్తే వెంటనే పోలీసుస్టేషన్‌కు పరుగెత్తుకొస్తారు. అలాంటి పోలీసుస్టేషన్‌కే దిక్కు లేకుండా పోయింది. ఒక ఏఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్నప్పటికీ ఒంటిమిట్ట పోలీసుస్టేషన్ ఆవరణంలో ఉన్న ఎర్రచందనం దుంగలను దొంగలెత్తుకుపోయారంటే జనం నోట మాట రావడం లేదు. వాళ్లు.. వాళ్లు.. కలిసిపోయారా లేక భయపడి మిన్నకుండిపోయారా అనేది తేల్చాల్సిన బాధ్యత పోలీసు పెద్దలదే.
ఒంటిమిట్ట : సాక్షాత్తు ఒంటిమిట్ట పోలీసుస్టేషన్ ఆవరణంలో ఉంచిన ఎర్రచందనం దుంగలను గురువారం రాత్రి దొంగలు ఎత్తుకెళ్లడం జిల్లాలో కలకలం రేపింది. పోలీసుల భద్రతపై సందేహాలు రేకెత్తించింది. ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ విధుల్లో ఉన్నప్పటికీ ఈ ఘటన చోటుచేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పట్టుకున్న సుమారు 200 ఎర్రచందనం దుంగలను పోలీసుస్టేషన్ ఆవరణంలో భద్రపరిచారు. ఇటీవల టీడీపీ నేత, స్మగ్లర్ బోడె వెంకటరమణ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వంద దుంగ లు సైతం ఇందులో ఉన్నాయి.
ఈ దుంగల్లోని 18 దుంగలు గురువారం రాత్రి అపహరణకు గురయ్యాయని మాత్రమే పోలీసులు చెబుతున్నారు. అంతకు మించి మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. ఈ వ్యవహారంలో ఇంటి దొంగల హస్తం ఉండవచ్చని ప్రజలు చర్చించుకుంటున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసుస్టేషన్లోనే దొంగతనం జరిగితే సామాన్యుల పరిస్థితి ఏమిటని జనం భయాందోళనకు గురవుతున్నారు. పోలీసుస్టేషన్ వెనుక వైపు నుంచి దొంగలు దుంగలను తీసుకెళ్లారు.
రాత్రి సమయంలో ఈ విషయాన్ని గమనించిన కొందరు పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇచ్చేందుకు ఎన్ని సార్లు స్టేషన్‌కు ఫోన్ చేసినా ఫోన్ తీయకపోవడంతో పోలీసుల పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుంగలను దొంగలు ఎత్తుకెళ్తుండగా చూసిన కొందరు స్మగ్లర్ల దెబ్బకు భయపడి అక్కడికి వెళ్లలేకపోయినట్లు సమాచారం. జైల్లో ఉన్న బడా స్మగ్లర్ బొడ్డె వెంకటరమణను విచారణ నిమిత్తం ఒంటిమిట్ట పోలీసుస్టేషన్‌కు రెండు రోజుల క్రితం తీసుకొచ్చారు.
తిరిగి అతన్ని సెంట్రల్ జైల్లో అప్పగించిన గురువారం రాత్రే ఈ దొంగతనం జరగడంతో అతనిపై అనుమానాలు బలపడుతున్నాయి. అతన్ని కలిసేందుకు వచ్చిన కొంత మంది నాయకుల సమాచారంతో స్మగ్లర్లు ఈ చోరీకి పాల్పడి ఉంటారని పలువురు చర్చించుకుంటున్నారు. అంతకు ముందు దాదాపు ఒక వారం పాటు బొడ్డె వెంకటరమణతో పాటు పలువురు స్మగ్లర్లు ఒంటిమిట్ట పోలీసుస్టేషన్లోనే బస చేశారు. ఒంటిమిట్ట పోలీసుస్టేషన్ పరిస్థితుల గురించి బొడ్డె వెంకటరమణ, అతనితో పాటు ఉన్న వారు బయట వారికి వివరించి ఈ చోరీ జరిపించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి పెద్ద సంఖ్యలో దుంగలు బయటకు తరలివెళ్లాయని సమాచారం.
పోలీసులు మాత్రం 18 దుంగలే అని చెబుతున్నారు. బొడ్డె వెంకటరమణ కారులో తిరిగే మండలానికి చెందిన ఓ నాయకున్ని విచారిస్తే అసలు విషయాలు బయట పడతాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే స్థాయిలో పలుకుబడి ఉన్న అతన్ని విచారించేందుకు పోలీసులు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. స్మగ్లర్ కారులో దొరికిన రోజునే ఆ నాయకున్ని అదుపులోకి తీసుకుని విచారించి ఉంటే మరిన్ని వివరాలు లభించేవని కొందరు పోలీసులు భావిస్తున్నారు. దుంగల చోరీపై కేసు నమోదు చేశామని, ఘటనపై విచారణ చేస్తున్నామని పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన డీఎస్పీ అశోక్‌కుమార్ చెప్పారు.