చార్జిషీట్లో చంద్రబాబు!
► ‘ఓటుకు కోట్లు’లో బాబు పాత్రపై స్పష్టమైన ఆధారాలు
► అభియోగపత్రంలో వివరించిన ఏసీబీ
► బాబు పంపితేనే వచ్చాన ని స్టీఫెన్సన్కు చెప్పిన రేవంత్‌రెడ్డి
► ఓటుకు ఎంతివ్వాలనేది బాబే నిర్ణయిస్తారని వెల్లడి
► ఈ వ్యవహారం బయటపడినా అండగా నిలబడతామని హామీ
► ఏపీ అసెంబ్లీలో నామినేటెడ్ ఎమ్మెల్యే పదవి ఇస్తామంటూ ఎర
► అనుబంధ చార్జిషీట్లో బాబును నిందితునిగా చేర్చే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలకపాత్ర పోషించినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. ఆయన కనుసన్నల్లోనే ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ కుట్రలో పాలుపంచుకున్నారని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలను ఇటీవల దాఖలు చేసిన చార్జిషీట్లో ఏసీబీ స్పష్టంగా వివరించింది. చంద్రబాబు చెబితేనే తాము వచ్చామని రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ స్పష్టం చేసినట్లు పేర్కొంది. ఓటుకు ఎంతివ్వాలనేది కూడా ఆయనే నిర్ధారిస్తారని.. అత్యంత రహస్యంగా ఆయన్ను కలిసే ఏర్పాటు చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పినట్లు చార్జిషీట్లో తెలిపింది.
ఓటుకు కోట్లు వ్యవహారం బట్టబయలైనా.. చంద్రబాబు అండగా ఉంటారని రేవంత్ ఇచ్చిన హామీని కూడా ప్రస్తావించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నామినేటెడ్ ఎమ్మెల్యే పదవి లేదా కేంద్ర ప్రభుత్వంలో క్రిస్టియన్ మైనారిటీ విభాగంలో కీలక పదవి ఇస్తారని చెప్పిన విషయాన్నీ చార్జిషీట్లో పేర్కొంది. టీడీపీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డికి ఓటు వేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టే క్రమంలో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ పలు సందర్భాల్లో చంద్రబాబు పేరును ప్రస్తావించినట్లు వివరించింది. ‘‘డీల్ విషయం మనవాళ్లు చెప్పారు. మీ వెంట నేనుంటా. హామీ ఇచ్చిన మేరకు అడిగినంతా ఇస్తాం’’ అని చంద్రబాబు.. సెబాస్టియన్ ఫోన్ ద్వారా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్లు నిర్ధారించింది.
ఈ నేపథ్యంలో ఈ కేసులో చంద్రబాబు చుట్టూ ఉచ్చుబిగుసుకుంటోంది. ఏసీబీ చార్జిషీట్లో ఆయన పేరును ప్రస్తావించిన నేపథ్యంలో ఈ కేసు నుంచి తప్పించుకునే అవకాశమేలేదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఏసీబీ అధికారులు చంద్రబాబును నిందితుడిగా చేర్చకపోయినా.. ఆయన పాత్రకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఏసీబీ ప్రత్యేక కోర్టు సీఆర్పీసీ సెక్షన్ 319 కింద నిందితుడిగా చేర్చి సమన్లు జారీ చేయవచ్చని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
ఆడియో, వీడియోలే కీలక ఆధారాలు
ఓటుకు కోట్లు కుట్రను నిర్ధారించేందుకు అవసరమైన అన్ని ఆధారాలను ఏసీబీ చార్జిషీట్లో వివరించింది. ఆడియో, వీడియో ఆధారాలకు సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) అధికారులు ఇచ్చిన నివేదికలే ఇప్పుడు కీలకంగా మారనున్నాయి. ఓటు కోసం స్టీఫెన్సన్ను మత్తయ్య (ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు) సంప్రదించినప్పటి నుంచి నోట్ల కట్టలతో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహా అడ్డంగా దొరికిపోయే వరకు అన్ని అంశాలను చార్జిషీట్లో ఆధారాలతో తెలిపింది. కుట్రలో నిందితుల పాత్రతోపాటు నోట్ల కట్టలతో పట్టుబడిన సమయంలో స్టీఫెన్‌సన్‌తో నిందితులు ఉన్నట్లు నిర్ధారించేందుకు వారి కాల్‌డేటా, సెల్‌టవర్ లొకేషన్స్ వివరాలను కూడా ఇందులో పేర్కొన్నారు. అలాగే నిందితుల కదలికలను నిర్ధారించేందుకు వీలుగా సర్వీస్ ప్రొవైడర్లను ాక్ష్యులుగా పేర్కొంది.
ఇది నేరపూరిత కుట్రే
చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ నేరపూరితకుట్రకు రూపకల్పన జరిగినట్లు ఏసీబీ నిగ్గుతేల్చింది. ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్ 120(బీ) (నేరపూరిత కుట్ర) చంద్రబాబుకు వర్తిస్తుంది. అలాగే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, మత్తయ్యలతో కలిసి ఈ కుట్రకు రూపకల్పన చేసినందున ఐపీసీ సెక్షన్ 34 (సమష్టి పాత్ర) చంద్రబాబుకు వర్తిస్తుంది. నిందితులు పలుమార్లు బాబు పేరును ప్రస్తావించిన నేపథ్యంలో కేసు నుంచి ఆయన తప్పించుకునే అవకాశం లేదని స్పష్టమవుతోంది.
సెక్షన్ 319 కింద నిందితుడిగా..
ఈ కేసులో చంద్రబాబు పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించినందున ఏసీబీ అధికారులు ఆయన్ను అనుబంధ చార్జిషీట్లో నిందితుడిగా చేర్చే అవకాశం ఉంది. ఏసీబీ అధికారులు ఆయన్ను నిందితునిగా చేర్చకపోయినా.. నేర విచారణ చట్టం (సీఆర్పీసీ) సెక్షన్ 319 ప్రకారం ప్రత్యేక కోర్టు సుమోటోగా చంద్రబాబును నిందితుడిగా చేర్చవచ్చు. సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఆయన్ను నిందితునిగా చేర్చి సమన్లు జారీ చేసే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉంది.