నాలుగు నియోజకవర్గాల్లో మహిళలే అధికం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా ఓటర్ల లెక్క తేలింది. జిల్లా వ్యాప్తంగా 19,59,660 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 9,80,897 మంది ఉండగా, స్త్రీలు 9,78,561 మంది ఉన్నారు. ఇతరులు (సర్వీసు ఓటర్లు) 202 మంది ఉన్నారు. 2014 జనవరి 31న విడుదల చేసిన తుది ఓటర్ల జా బితా ప్రకారం జిల్లాలో 19,18,267 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడా సంఖ్య 19,59,660కి చేరింది. అయి తే ఈ ఏడాది జనవరి 31 తరువాత ఓటు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో 41,393 మంది అధికారులు చోటు కల్పించారు. అంటే ఫిబ్రవరి, మార్చి నెలల్లో 41,393 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.
వచ్చిన దరఖాస్తులు ఇప్పటి వరకు పరిశీలించిన అధికారులు ఎన్నికల సంఘానికి నివేదించారు. అనంతరం ఎన్నికల సంఘం జిల్లాకు ఫొటో ఓటరు జాబితాను పంపించారు. ప్రస్తుత ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాలైన ఖానాపూర్, బోథ్, నిర్మల్, ముథోల్‌లలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. కాగా, 2014 జనవరి 31న విడుదల చేసిన ఫొటో ఓటరు జాబితాను సప్లిమెంటరీ -1గా, ఏప్రిల్‌లో జిల్లాకు చేరిన ఫొటో ఓటర్ల జాబితాను సప్లిమెంటరీ-2గా పరిగణిస్తారు. ప్రస్తుతం సప్లిమెంటరీ-2 జాబితాలో ఉన్న ఓటర్లు సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును విని యోగించుకోనున్నారు. ప్రస్తుతం జాబితా ప్రకారం పురుషుల సంఖ్యను బట్టి చూస్తే ఇంకా 2,336 మంది మహిళా ఓటర్లు తక్కువగా ఉన్నారు.
యువతే నిర్ణేత..!
ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాల వల్ల యువతీ, యువకులు చైతన్యం పొంది పెద్ద ఎత్తున తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకున్నారు. తాజా జాబితా ప్రకారం జిల్లాలో 18 నుంచి 29 మధ్య వయస్సు వారు 6,95,789 మంది నమోదై ఉన్నారు. దీంతో ప్రతి నియోజకవర్గంలో యువత కనీసం 50 వేలకు మించకుండా ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా తూర్పు ప్రాంతం నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం యువత ఉన్నారు. జిల్లాలో సర్వీసు ఓటర్లు 202 మంది ఉండగా, ఇందులో తూర్పు ప్రాంతం నియోజకవర్గాలకు సంబంధించిన వారే 124 మంది ఉన్నారు.