ఈశాన్యం ఎటువైపు ?
2014లో భిన్నమైన తీర్పునిచ్చే అవకాశం
ఎలక్షన్ సెల్: బంగ్లాదేశ్, భూటాన్, చైనా, మయన్మార్, నేపాల్.. ఈ ఐదు దేశాలతో సరిహద్దులను పంచు కునే ఈశాన్య రాష్ట్రాలు విభిన్న జాతులు, భాషలు, సంప్రదాయాల సమాహారం. దశాబ్దాలుగా జాతుల మధ్య విభేదాలు, సీమాంతర ఉగ్రవాదం, శరణార్థుల అక్రమ చొరబాట్లు, వేర్పాటువాద ఉద్యమాలు, తిరుగుబాట్లతో ఈ ప్రాంతం వెనకబాటుకు గురైంది. అస్థిరతకు ఆలవాలమైంది. అయితే ఇటీవలి కాలంలో ఈశాన్య రాష్ట్ర్రాల ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఎన్నికలను ప్రభావితం చేసే అంశంగా గతంలో తీవ్రవాదం ఉండేదని, ఇప్పుడు ఆ స్థానంలో ఆర్థికాభివృద్ధి, విద్య, ఉద్యోగ కల్పన, సంక్షేమం, ఆరోగ్యం మొదలైన అంశాలు చేరాయి. 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో అసోం సహా ఈ రాష్ట్రాల సగటు వృద్ధి జాతీయ సగటును అధిగమించి 9.95% గా ఉండటం గమనార్హం.
సీట్లు పెంచుకునేందుకు కాంగ్రెస్ వ్యూహం
అరుణాచల్‌ప్రదేశ్, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ, సిక్కిం, త్రిపురల్లో మొత్తం 11 లోక్‌సభ స్థానాలున్నాయి. రాజకీయంగా చూస్తే మెజారిటీ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌దే ఆధిపత్యం. మణిపూర్, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయాల్లో ఆ పార్టీనే అధికారంలో ఉంది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికే ఈ ప్రాంత అభివృద్దికి సంబం ధించి పలు ప్రతిపాదనలు రూపొందించారు. 2009లో గెలుచుకున్న స్థానాలను నిలుపుకోవడం తో పాటు మరికొన్ని సీట్లు పెంచుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది.
బీజేపీ.. ప్రత్యేక ప్రణాళిక
ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం కూడా గణనీయంగానే ఉంది. వాజ్‌పేయి హయాంలోని ‘లుక్ ఈస్ట్’ విధానం సత్ఫలితాలను ఇచ్చిందన్న భావన ఇక్కడి ప్రజల్లో ఉంది. అధికారంలోకి వస్తే ఈ ప్రాంతాన్ని వ్యాపార కేంద్రంగా మారుస్తామని చెబుతోంది. ప్రతి ఈశాన్య రాష్ట్రానికి సంబంధించి ఒక విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తోంది.
జాతీయ పార్టీలకు సంగ్మా సవాలు..
ఇక్కడ ప్రాంతీయ పార్టీల ప్రభావాన్ని కూడా తక్కువగా అంచనా వేయలేం. అదీగా, ఈ ఎన్నికల్లో 10 పార్టీలు ఒక్కటై లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా నేతృత్వంలో ‘నార్త్ఈస్ట్ రీజినల్ పొలిటికల్ ఫ్రంట్(ఎన్ఈఆర్పీఎఫ్)’గా ఏర్పడ్డాయి. అసోంతో కలుపుకుని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గానూ 21 స్థానాల్లో ఈ ఫ్రంట్ అభ్యర్థులను బరిలో దింపడం కాంగ్రెస్, బీజేపీల విజయావకాశాలను దెబ్బతీసే అంశమే. స్థానికత, ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం, జాతీయ పార్టీలపై వ్యతిరేకత, సంగ్మా వ్యక్తిత్వం.. ఈ ఎన్నికల్లో ఎన్ఈఆర్పీఎఫ్కు కలిసొచ్చే అంశాలు. ‘లోక్‌సభలో మాకంటూ ఒక బలమైన ప్రాతినిధ్యం కావాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు’ అని సంగ్మా చెబుతున్నారు.
ఎన్నికలు ఎప్పుడు?
అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ - ఏప్రిల్ 9న.
త్రిపుర - ఏప్రిల్ 7, ఏప్రిల్ 12
సిక్కిం - ఏప్రిల్ 12
మేఘాలయ: 2 స్థానాలు
మొత్తం ఓటర్లు , 15.53లక్షలు
మేఘాలయలో కాంగ్రెస్‌కు కొంత ఆశాజనక పరిస్థితి కన్పిస్తోంది. యునెటైడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీఎఫ్)తో పొత్తు కలిసిరావొచ్చు. బీజేపీ మోడీ మంత్రాన్నే జపిస్తోంది.
త్రిపుర: 2 స్థానాలు
మొత్తం ఓటర్లు : 23.5లక్షలు
త్రిపురలో సీపీఎం హవా ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే ఈసారి కాంగ్రెస్, బీజేపీలకు పెద్దగా ఆశలు లేనట్టే. మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో 50 వామపక్షాలే గెలిచాయి. లెఫ్ట్ పార్టీలను తరిమికొట్టాలన్న రాహుల్ పిలుపు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారింది.
మణిపూర్: 2 స్థానాలు
మొత్తం ఓటర్లు: 17.5లక్షలు
2009లో రెండు స్థానాలనూ కాంగ్రెసే గెలుచుకుంది. రాష్ర్టంలో తామే అధికారంలో ఉండడంతో రెండు ఎంపీ స్థానాలను గెల్చుకోగలమని కాంగ్రెస్ దీమాతో ఉంది. సీఎం ఇబోబి సింగ్‌పై ప్రజల్లో వ్యతిరేకత లేకపోవడం కాంగ్రెస్‌కు కలిసిరావొచ్చు.
అరుణాచల్ ప్రదేశ్ : 2 స్థానాలు
మొత్తం ఓటర్లు: 7.5లక్షలు
రాష్ర్టంలోని రెండు ఎంపీ స్థానాలను 2009లో కాంగ్రెస్ గెల్చుకోగా.. 2004లో బీజేపీ సొంతం చేసుకుంది. ఈ ఎన్నికల్లో మోడీ ప్రభావం కనిపించవచ్చు. 2004 ఫలితాలను మళ్లీ సాధించాలనే కృతనిశ్చయంతో బీజేపీ ఉంది. ‘రాజకీయాల్లోంచి రిటైరయ్యాక అరుణాచల్ ప్రదేశ్‌లోనే సెటిల్ అవుతాను..’ అంటూ ఇటీవల రాహుల్‌గాంధీ ఇక్కడి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
సిక్కిం స్థానాలు
మొత్తం ఓటర్లు: 3.5లక్షలు
సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డిఎఫ్)కు ఎదురులేదు. జనంలో మంచి పట్టుంది. ఈసారి కూడా ఎంపీ సీటును గెల్చుకోవచ్చని అంచనా.
మిజోరం: మొత్తం ఓటర్లు
స్థానాలు: 6.4లక్షలు
ఏకైక సీటును 2004లో మిజో నేషనల్ ఫ్రంట్, 2009లో కాంగ్రెస్ నెగ్గింది. ఈసారి ఈ రెండింటి మధ్యే ప్రధాన పోరు ఉంటుంది.
నాగాలాండ్: మొత్తం ఓటర్లు స్థానాలు, 11.7లక్షలు
రాష్ర్టంలో నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు ఎదురు లేదు. ఈ ఎన్నికల్లో కూడా ఎంపీ స్థానాన్ని నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది.
రాహుల్ టీ షర్ట్.. నమో టీ మగ్
ఎన్నికల పుణ్యమా అని ఆన్లైన్ షాపింగ్ సైట్లకు అమ్మకాల కళ వచ్చింది! కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్)లకు సంబంధించిన వస్తువులు కావాలంటూ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయని సైట్ల యజమానులు సంబరపడిపోతున్నారు. స్నాప్‌డీల్, బ్లూగేప్, ఫ్లిప్‌కార్ట్, ప్రింట్వెన్యూ మొదలైన సైట్లకు అభిమానుల తాకిడి బాగా ఉందిట. సైట్లలో ముఖ్యంగా రాహుల్‌గాంధీ ఫొటో ఉన్న టీ షర్ట్, నరేంద్రమోడీ బొమ్మ ఉన్న టీ మగ్ (బాల్యంలో రైల్వేస్టేషన్లో మోడీ టీ అమ్మిన విషయం ఇటీవల బాగా ప్రచారంలోకి రావడం తెలిసిందే)లకు విపరీతమైన క్రేజ్ ఉందట. వాటితోపాటు రాహుల్‌గాంధీ, నరేంద్ర మోడీ, అరవింద్ కేజ్రీవాల్‌ల ఫొటోలు ప్రింటై ఉన్న గడియారాలు, ల్యాప్‌టాప్ బ్యాగులు కూడా బాగానే అమ్ముడుపోతున్నాయట. ఆప్ గుర్తు చీపురుకట్టకూ డిమాండ్ బాగానే ఉంది. ‘మేం ఝాడూ క్యాంపేయిన్(చీపురుకట్ట ప్రచారం) ప్రారంభించిన తొలి రెండు రోజుల్లో 6 వేల చీపుర్లను అమ్మగలిగాం’ అని ట్రేడస్ వెబ్సైట్ సీఈఓ ముదిత్ ఖోస్లా గుర్తుకు తెచ్చుకున్నారు.
రామ్.. శ్యామ్.. కృష్ణ
ఎవరివీ పేర్లు అనుకుంటున్నారా..? ప్రస్తుతం బీహార్‌లో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల్లో చాలామంది పేర్లు ఇవే! అన్ని పార్టీల అభ్యర్థుల జాబితా పరిశీలిస్తే.. పేరులో రామ్ అని ఉన్న అభ్యర్థులు అత్యధిక సంఖ్యలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో కృష్ణ, శ్యామ్ అనే పేర్లు నిలిచాయి. విచిత్రమేంటంటే అయోధ్యలో రామమందిర నిర్మాణం అంశంతో పాపులర్ అయిన బీజేపీలో రామ్ పేరున్న అభ్యర్థులు అతి తక్కువగా.. కేవలం ఇద్దరే ఉన్నారు. వారిలో ఒకరు లాలూ ప్రసాద్‌కు చాలా దగ్గరివాడు, ఇటీవలే బీజేపీలో చేరి పాటలిపుత్ర స్థానం నుంచి బరిలో ఉన్న రామ్‌కృపాల్ యాదవ్. ఇక బీజేపీతో జతగట్టిన లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ) నుంచి ముగ్గురు ‘రామ్’ నామ అభ్యర్థులున్నారు. వారు రామ్ విలాస్ పాశ్వాన్, రామ్ కిశోర్‌సింగ్, రామ్ చంద్ర పాశ్వాన్. దాంతో ‘ఎల్జేపీ ఇప్పుడు నిజమైన కాషాయరంగు దాల్చింది’ అంటూ లాలూ ప్రసాద్ ఇటీవల చమత్కరించారు.
కర్ణాటక బరిలో ఐదుగురు సీఎంలు
కర్ణాటకలో ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలో ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులు నిలిచారు. వారు ఎం.వీరప్ప మొయిలీ (కాంగ్రెస్), ఎన్ ధరమ్‌సింగ్ (కాంగ్రెస్), బీఎస్ యడ్యూరప్ప (బీజేపీ), డీవీ సదానంద గౌడ (బీజేపీ), జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ. వీరితో పాటు దేవెగౌడ కుమారుడు, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తున్నారు. మొయిలీ చిక్‌బళ్లాపుర స్థానం నుంచి పోటీకి దిగాలనుకుంటున్నారు. యడ్యూరప్ప షిమోగా నుంచి, సదానంద గౌడ ఉత్తర బెంగళూరు నుంచి, దేవెగౌడ హసన్ నుంచి, ధరమ్‌సింగ్ బీదర్ నుంచి పోటీలో ఉన్నారు. వీరిలో ధరమ్‌సింగ్, యడ్యూరప్ప, దేవెగౌడ విజయం సులభమే కానీ మొయిలీ, సదానందలకు గట్టి పోటీ తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు.