గ్రేటర్లో ఓట్ల గల్లంతుపై సీఈసీ విచారణ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓట్ల నమోదు, ఓటర్ల ఏరివేత ప్రక్రియపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. భారీగా ఓట్లు గల్లంతైనట్లుగా వరుసగా ఆరోపణలు.. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం అధ్వర్యంలో ఢిల్లీ నుంచి ముగ్గురు అధికారుల బృందం గురువారం రాష్ట్రానికి చేరుకుంది. మూడు రోజుల పాటు ఈ బృందం నగరంలోని పలు ప్రాంతాల్లో ఓటర్లను కలసి వాస్తవాలు తెలుసుకోనుంది.
ఈ నెల 31న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై వారి అభిప్రాయాలను స్వీకరిస్తుంది. ఇటీవల ఓటర్ల సవరణలో భాగంగా గ్రేటర్ పరిధిలో దాదాపు 25.30 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు చేపట్టిన ఇంటింటి సర్వేలో 6.30 లక్షల ఓటర్ల పేర్లను జాబితాలో నుంచి తొలగించారు. చనిపోయినవారు, డబుల్ పేర్లున్నవారు, చిరునామాలో లేకుండాపోయిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించినట్టుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ ఇటీవలే ప్రకటించారు.
మరో 19 లక్షల మంది ఓటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. కానీ.. బతికి ఉన్న వారిని సైతం చనిపోయినట్లుగా చూపించారని, ఓటర్లు అదే చిరునామాలో ఉన్నప్పటికీ డోర్ లాక్, వలస వెళ్లారని రాసుకోవడం గందరగోళానికి తెర లేపింది. ఒక్క కూకట్పల్లి నియోజకవర్గంలోనే 1.08 లక్షల మంది ఓటర్లను జాబితాలో నుంచి తొలగించారు. శేరిలింగంపల్లి, జూబ్లీ హిల్స్ పరిధిలో మరో 1.10 లక్షల ఓట్లను తీసేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు కొందరు అధికారులు ఏజెంట్గా మారారని, ప్రతిపక్షాలకు పట్టున్న ప్రాంతా ల్లో ఉద్దేశపూర్వకంగా ఓట్లను తొలగించారని ఆయా పార్టీల నుంచి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు అందాయి. వీటిపై స్పందించిన ఎన్నికల కమిషన్ ఈ విచారణకు ఆదేశించింది.
2014 సాధారణ ఎన్నికల సమయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 83.77 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో దాదాపు 20 లక్షల మందికిపైగా నోటీసులు జారీ చేయడంపై నగర ప్రజలు సైతం అయోమయానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం విచారణ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.