2015కల్లా విశాఖ పోర్టుకు భారీ నౌకలు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విశాఖ పోర్టుకు పూర్వ వైభవ ం తీసుకొచ్చే దిశగా శర వేగంగా అభివృద్ది పనులు చేపడుతున్నామని చైర్మన్ ఎంటి కృష్ణబాబు చెప్పారు. పోర్టు చైర్మన్‌గా సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూ. 2500 కోట్ల పెట్టుబడులతో పోర్టు అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు. ఇవన్నీ పూర్తి కావాలంటే 2015 వరకూ ఆగాల్సిందేనని అప్పుడే భారీ నౌకలకు చోటు కల్పించే అవకాశం వుందన్నారు. డ్రెడ్జింగ్ పనులు, మెకనైజ్డ్ పనులే కీలకంగా వున్నందున వాటిపైనే ఎక్కువ దృష్టి సారిస్తామన్నారు.
పోర్టు ఆధునికీకరణలో భాగంగా ఇప్పటికే మంజూరైన పనులన్నీ నిర్ణీత వేళలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రైవేట్ పోర్టులతో సమానంగా ప్రస్తుత రోజుల్లో పరుగెత్తడం సాధ్యం కానందున మౌళికవసతులన్నీ సమకూర్చుకుని పూర్వ వైభవానికి బాటలు వేస్తామని చెప్పారు. కార్గో రవాణాలో పోటీ ఎక్కువగా వున్నందున పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్(పీపీపీ) పద్దతిలో కలిసి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నామని తెలిపారు. గత మూడేళ్లుగా పోర్టు ఆదాయం తగ్గుతోందని అందుకు డ్రెడ్జింగ్ పనులు లేకపోవడమేనన్నారు. భారీ నౌకలు వచ్చే అవకాశం లేక ఆదాయానికి గండిపడుతోందన్నారు.
కొత్తగా వచ్చిన గంగవరం, కృష్ణపట్నం పోర్టుల్లో ఒకే ప్లాట్‌ఫారంపై ఆరు నౌకలు వుండే అవకాశం వుందని అందుకే అక్కడ రెవెన్యూ పెంచుకోగలుగుతున్నారని చెప్పారు.రానున్న ఆగష్టు మాసం నాటికి రూ. 230 కోట్లు ఖర్చు చేసి 16.1 మీటర్ల డ్రెడ్జింగ్ పూర్తి చేయాలనుకుంటున్నామని చెప్పారు. కనీసం 10 నుంచి 14 మీటర్ల డ్రెడ్జింగ్ చేయకపోతే ఇప్పటి వరకూ చేసిన డ్రెడ్జింగ్ అంతా వృధా అయ్యే అవకాశం వుందని వెల్లడించారు. లూజ్ సాయిల్ కావడంతో డ్రెడ్జింగ్ పనులు త్వరితగతిన పూర్తవుతాయని భావిస్తున్నామన్నారు. పోర్టులోనికి ప్రవేశించే ద్వారం వద్ద డ్రెడ్జింగ్ పూర్తయిన తర్వాతే మార్కెటింగ్‌పై దృష్టి సారిస్తామన్నారు.