రోదన వెనుక కోట్ల వేదన
నారాయణా పాహిమాం : వివేకా శరణు
పోరాడుతున్న పూర్వపు విద్యార్థుల సంఘాలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : జిల్లాలో ప్రత్యేక గుర్తింపు కలిగిన ఆనం కుటుంబానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వివేకానందరెడ్డి మంత్రి పొంగులేటి నారాయణ శరణు కోరడం వెనుక రూ.కోట్లు విలువ చేసే వి.ఆర్. విద్యా సంస్థల ఆస్తుల వ్యవహారమే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. నగరం నడిబొడ్డున వి.ఆర్ విద్యాసంస్థలకు చెందిన సుమారు 16 ఎకరాలు, అందులోని భవనాల మార్కెట్ విలువ రూ.500 కోట్ల పైచిలుకే అన్నది అంచనా. విద్యా సంస్థల్లో 300 మందికి పైగా బోధన, బోధనేతర సిబ్బంది
ఉండటం, విభిన్న పద్ధతుల్లో నెలకు సుమారు పాతిక లక్షల రూపాయల వరకు సముపార్జన ఉండటంతో వాటిపై పట్టు చేజార్చుకోకుండా ఉండటానికే ఆనం నానా పాట్లు పడుతున్నారనేది బహిరంగ రహస్యమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే మంత్రి నారాయణ వద్దకు వెళ్లి అంతలా బతిమలాడాల్సిన అగత్యం వివేకానందరెడ్డికి ఏర్పడిందని గుర్తుచేస్తున్నారు. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయంటే ఇదేనేమో అంటున్నారు. నారాయణా నన్ను రక్షించవా అంటూ వివేకా బుధవారం మంత్రిని వేడుకున్న తీరు.. ‘ఇందుకంటయ్యా! రాజకీయాలు, పదవులు అంటూ కోటీశ్వర్లు సైతం వెంపర్లాడుతుంటారు. ఏమైనా కానీ రాజకీయాల్లో భలే మజా ఉందయ్యా’..అని తన అనుయాయుల వద్ద మంత్రి తనదైన శైలిలో వ్యాఖ్యానించడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆనం సోదరుల మధ్య రగడ
నెల్లూరు నగరంలో వి.ఆర్ విద్యా సంస్థలు అంటే ప్రస్తుతం ఆనం కుటుంబం గుర్తుకు వస్తుంది. అన్నదమ్ముల బిడ్డలైన ఆనం కుటుంబాలకు చెందిన వారి మ«ధ్య రగడ తలెత్తడం, వి.ఆర్. విద్యాసంస్థలకు సంబం«ధించి 1993లో పాలకమండలి ఎన్నికలు సహేతుకంగా జరగలేదని, ఆ కమిటీ ఎన్నికను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు కొంతకాలం కిందట తీర్పును వెలువరించింది. కమిటీని రద్దు చేసి ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించిన సంగతి తెలిసిందే. వి.ఆర్ విద్యాసంస్థలకు ఆనం వివేకానందరెడ్డి కరస్పాండెంట్‌గా, ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో కమిటీ రద్దయిన పక్షంలో ఆనం సోదరులకు వి.ఆర్.పై పెత్తనం పోతుంది. తద్వారా ఆర్థికమూలాలు దెబ్బతింటాయి.
దేవాదాయశాఖకు చెందితే...
వి.ఆర్. విద్యాసంస్థల పూర్వపు పాలకవర్గం ఈ సంస్థకు చెందిన ఆస్తిపాస్తులను దేవాదాయశాఖకు రాసిచ్చింది. ఆరు నెలల కిందట దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రూ.18 లక్షలను ప్రస్తుత కమిటీ నుంచి కట్టించుకుంది. కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వ చర్యలను బట్టి విద్యాసంస్థల ఆస్తిపాస్తులన్నీ దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లిపోతాయి. అదే జరిగితే ఆనం సోదరులకు నగర రాజకీయాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు తప్పవని రాజకీయ పక్షాలతో సహా అన్ని వర్గాల అభిప్రాయం. వీటన్నింటి నేపథ్యంలోనే ఎలాగైనా సరే ప్రత్యేక అధికారి పాలనలోకి, దేవాదాయ శాఖ పరిధిలోకి విద్యా సంస్థలు వెళ్లకుండా చూడాలని వివేకానందరెడ్డి కాళ్లావేళ్లా పడుతున్నారని అధికారపార్టీ వాళ్లే జోరుగా ప్రచారం సాగిస్తున్నారు.
నాడలా.. నేడిలా..
తనకు కావాల్సిన ఓ మహిళా మాజీ ప్రజాప్రతినిధి తరఫు వారికి మెడికల్ సీటు ఉచితంగా ఇవ్వాలని కళాశాల యజమాని నారాయణకు అప్పటి ఎమ్మెల్యే ఆనం వివేకా సూచించారు. సీటు ఇవ్వనందుకు తన ప్రతాపం చూపిస్తానంటూ హూంకరించి మీ కాలేజీలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ కార్పొరేషన్ అ«ధికారులను పంపి రెడ్‌టేప్ వేయించడం, కొంత భాగాన్ని పడకొట్టించడం చేశారు. అప్పట్లో ఈ సంఘటన నెల్లూరు నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది. అప్పట్లో మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి వద్దకు పి.నారాయణ వెళ్లి తన గోడును వెళ్లబోసుకున్నా తను చేయగలిగింది ఏమీ లేదని, వివేకానందరెడ్డి వద్దే ఏదైనా తేల్చుకోవాలని తేల్చి చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో నారాయణ హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే వివేకా ఇంటి వద్ద ఆరు గంటల పాటు ఎదురుచూశాక ఆనం ఇష్టానుసారం నోరుపారేసుకున్నారు. ఇదంతా 2013 నవంబరులో జరిగింది.
తాజాగా ఇదీ సంగతి...
వి.ఆర్. విద్యాసంస్థల కమిటీ ఎన్నిక చెల్లుబాటు కాదని న్యాయస్థానం తీర్పు చెప్పిన నేపథ్యంలో ఈ అంశంపై అధికారపార్టీలో భాగస్వామి అయిన బీజేపీ అనుబంధ సంస్థ బీజేవైఎం ప్రెస్‌మీట్ పెట్టి మరీ కళాశాల కమిటీని రద్దుచేసి ప్రత్యేక అధికారిని నియమించాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మంత్రి వద్దకు వెళ్లి ‘సర్, ఈ పరిస్థితుల్లో మీరు తప్ప మరెవరూ మమ్మల్ని కాపాడలేరు’ అంటూ కాళ్లా వేళ్లా పడి భోరున విలపించారు. 2013లో తనకు ఎదురైన సంఘటనను గుర్తుచేస్తూ రాజకీయాల్లో ఇంత మజా ఉంటుందా అయ్యా అని మంత్రి చేసిన వ్యాఖ్యలు జిల్లాలో విస్తృత చర్చనీయాంశంగా మారాయి.