వీఆర్‌ఎస్పీకి జలకళ
ఆత్మకూరు: వరదరాజస్వామి ప్రాజెక్ట్‌కు మూడేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో నిండింది. ఐదు రోజులుగా నల్లమల పరిధిలో భారీ వర్షాలు పడటంతో వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్ట్ నీటి మట్టం 398 అడుగులు కాగా ఆదివారం నాటికి పూర్తి స్థాయికి చేరుకోవడంతో దిగువన ఉన్న చెరువులకు నీటిని వదిలారు. ఇప్పటికే ప్రాజెక్టు కింద కొట్టాల చెరువు, కురుకుంద, కొత్తపల్లి, వడ్ల రామాపురం చెరువులు పూర్తిస్థాయిలో నిండగా, బావాపురం, లింగాపురం పాలెం చెరువు, గువ్వలకుంట్ల చెరువుకు ప్రాజెక్ట్ నీటిని వదిలారు. మూడేళ్లుగా వరుస కరువుతో తీవ్రంగా నష్టపోయిన రైతులు ఈ సారి చెరువులకు నీరు రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు కొత్తపల్లి మండలాలలోని 18 గ్రామాల పొలాలకు 1986లో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కేవలం రూ. 35 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. అర టీఎంసీ నీటి సామర్థ్యంలోపే ప్రాజెక్టును నిర్మించినప్పటికీ చెరువులకు నీరు విడుదల చేయడంతో రైతులకు ఊరటనిచ్చే ప్రాజెక్టుగా మిగిలింది. ఆత్మకూరు, కొత్తపల్లి మండలాల్లో మెట్ట భూములు కావడంతో ఈ ప్రాజెక్టులతో నీటిని నిల్వ చేసి చెరువులకు వదలడంతో ప్రాజెక్టు కింద రబీలో వరి, పెసర, మినుము, మొక్కజొన్న, వేరుసెనగ, పొద్దుతిరగుడు పంటలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఏర్పడింది.