11న నిజామాబాద్‌లో తెరసం సాహిత్య సదస్సు
–తెరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి.శంకర్
సాక్షి, కామారెడ్డి : తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 11న నిజామాబాద్‌లోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో సాహిత్య సదస్సు నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి.శంకర్ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని కర్షక్ కళాశాలలో గురువారం తెరసం సాహిత్య సదస్సుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదస్సుకు ముఖ్య అతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి హాజరవుతారని, వక్తలుగా తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, సంపాదకులు కె.శ్రీనివాస్ పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెరసం బాధ్యులు మోతుకూరి అశోక్‌కుమార్, తగిరంచ నర్సింహారెడ్డి, బి.చలపతి, సీహెచ్ ప్రకాశ్, శేరోజు శ్రీనివాస్, సతీష్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.