vulgarity
-
సినిమాలు, టీవీ సీరియల్స్‌లోనూ అశ్లీలతే!
పనాజి: టీవీ సీరియల్స్, సినిమాల్లో అశ్లీలత, పో* చిత్రాల ప్రభావం.. దేశంలో యువతరంపై తీవ్రంగా ఉంటోందని ప్రముఖ యోగా గురు రామ్‌దేవ్ అంటున్నారు. ఈరోజుల్లో.. పో* చిత్రాలు ఎక్కువగా నిర్మితం అవుతున్నాయి. సినిమాలు, ఇతర ఎంటర్టైన్మెంట్ మాధ్యమాలు, ఆఖరికి ఇంటిల్లిపాది చూసే టీవీ సీరియళ్లలోనూ అశ్లీలత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ కంటెంట్ యువతను ఎక్కడికో తీసుకెళ్తోంది. వాళ్లు వాటితోనే ప్రయాణిస్తున్నారు అని మిరామర్ బీచ్‌లో(గోవా)లో జరిగిన మూడు రోజుల యోగా క్యాంప్ సందర్భంగా రామ్‌దేవ్ ఈ కామెంట్లు చేశారు. అందుకే ఆధ్యాత్మికం, యోగా వైపు మళ్లాలని ఆయన యువతకు సూచించారు. ఇక ఎటువంటి మందులు తీసుకోకుండా సహజంగా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ప్రజలను మార్గనిర్దేశం చేయడమే తన లక్ష్యమని చెప్పారు బాబా రామ్‌దేవ్. సనాతనం అనేది అన్ని మతాలను కలిపే వారధని.. అందుకే దానిని అనుసరించాలని తాను ఎల్లప్పుడూ ప్రజలను కోరుతున్నానని యోగా గురు చెప్పారు. హిందూయిజం, జైనిజం, బుద్ధిజం, సిద్ధలోనే కాదు.. సనాతనం అనేది ఇస్లాం, క్రైస్తవంలోనూ ఉంది. సనాతనం అనేది ఏమాత్రం వివాదాస్పదమైన పదం కాదని అన్నారు. ఏదైనా నిర్దిష్ట మతం లేదంటే రాజకీయ ఎజెండాతో సంబంధం లేదు అని రామ్‌దేవ్ వ్యాఖ్యానించారు. -
అశ్లీలానికి అడ్డుకట్ట
చెన్నై: ఆలయ ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలకు అడ్డుకట్ట వేయాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. వివాదాలకు ఆస్కారం లేని రీతిలో భద్రత కల్పించడం, సంప్రదాయ, భక్తితో కూడిన నృత్యాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని సూచించింది. గ్రామాల్లో జరిగే ఆలయ వేడుకల్లో ఎవరికి వారు దూకుడుగా వ్యవహరించడం, వివాదాలకు దిగడం పరిపాటిగా మారింది. ఇటీవల కాలంగా ఆలయ ఉత్సవాల్లో వివాదం, రగడ అంటూ లేని ప్రదేశాలు లేవు. ప్రధానంగా ఈ వేడుకల్లో కరగాటం, కోలాటంలతో పాటుగా అశ్లీల నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వలన ఆకతాయిల వీరంగాలు వివాదాలకు దారి తీస్తూ వస్తున్నాయి. ఈ వివాదాలకు తోడుగా సామాజిక వర్గాల మధ్య భగ్గుమనే ఆగ్రహం పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. భద్రతను ఎంత కట్టుదిట్టం చేసినా ఈ నృత్యాల రూపంలో వివాదాలు రాజు కుంటుండటంతో వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. ఈ క్రమంలో ఆలయ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తిరుచంగోడుకు చెందిన దివాకర్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ మంగళవారం న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించాలే గానీ, వేడుకల పేరుతో అశ్లీల నృత్య ప్రదర్శనలు ఏర్పాట్లు చేస్తే కఠినంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. అశ్లీల నృత్యాలకు అడ్డుకట్ట వేస్తూ ఆదేశాలు ఇచ్చారు. అశ్లీల నృత్యాలు, ప్రదర్శనలకు ఏర్పాటు చేస్తే నిర్వాహకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.