లక్ష్మణ్ అకాడమీలో క్రికెట్ సెలక్షన్స్
సాక్షి, హైదరాబాద్: టాలెంట్ ఉన్నా ఎదగడానికి అవకాశం లేని వర్ధమాన క్రికెటర్ల అభ్యున్నతి కోసం భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్వయంగా ముందుకొచ్చారు. తెలంగాణలోని ఇతర జిల్లాలకు చెందిన యువకుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు వీవీఎస్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో క్రికెట్ సెలక్షన్స్ నిర్వహించనున్నారు. ఇందులో రాణించిన క్రీడాకారులకు ఉచిత శిక్షణను అందిస్తారు. తొలి విడతగా కరీంనగర్ జిల్లా 8 ఇన్‌క్లయిన్ కాలనీలోని అబ్దుల్ కలామ్ స్టేడియంలో జనవరి 28న, నల్లగొండలోని డాన్‌బాస్కో అకాడమీలో 29వ తేదీన సెలక్షన్స్ జరుగుతాయి. 16 నుంచి 24 ఏళ్ల లోపు యువకులు ఈ ఎంపిక పోటీలకు అర్హులు. తొలి విడత సెలక్షన్స్‌లో రాణించిన క్రీడాకారులకు హైదరాబాద్‌లోని వీవీఎస్ స్పోర్ట్స్ అకాడమీలో రెండో విడత పోటీలు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఉచిత శిక్షణకు ఎంపికవుతారు. వీరికి ఏప్రిల్, మే నెలల్లో క్రికెట్లో మెళకువలు నేర్పిస్తారు. శిక్షణ కాలంలో ప్రదర్శన ఆధారంగా హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) లీగ్ మ్యాచ్‌ల్లోనూ ఆడేందుకు వీరికి అవకాశం కల్పిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 25లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నల్లగొండ జిల్లా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం విజయ్ ప్రకాశ్ (7659945513), కరీంనగర్ జిల్లా అభ్యర్థులు కృష్ణారెడ్డి (9059818383)లను సంప్రదించాలి.