జైలులో ఉన్నవారిని కలవాలంటే..!
పాలకోడేరు రూరల్: జైలులో ఉన్న రిమాండ్ ఖైదీలు, శిక్ష అనుభవిస్తున్న ముద్దాలను కలవాలంటే ఎలా అనే విషయాలను భీమవరం సబ్‌జైలు చీఫ్ హెడ్ వార్డర్ వీవీవీఎస్ఎం ప్రసాద్ తెలిపారు. ఏం చేయాలి, ఎవరి అనుమతి తీసుకోవాలి, వారానికి ఎన్నిసార్లు కలవొచ్చు, ఎంత సమయం మాట్లాడవచ్చు తదితర వివరాలు తెలుసుకోండి.
అనుమతి తీసుకోవడం ఇలా..
జైలులో ఉన్నవారిని కలిసేందుకు ముందుగా ఓ దరఖాస్తు పూర్తిచేయాల్సి ఉంటుంది. సంబంధిత ఖైదీ వివరాలు, కలవడానికి వచ్చిన వారి వివరాలు, ఖైదీతో వీరికున్న బంధం, చిరునామాను దరఖాస్తుపై పూరించాలి. దీంతో పాటు కలవడానికి వచ్చిన వారి ఆధార్ లేక రేషన్ కార్డు జెరాక్సు కాపీ జతచేయాలి. దరఖాస్తును జైలు సిబ్బందికి అందిస్తే వారు సూపరింటెండెంట్‌కు పంపిస్తారు. ఆయన దానిని పరిశీలించి అనుమతి ఇస్తారు.
రెండు సార్లు.. 20 నిమిషాలు
వారానికి రెండు సార్లు సాధారణ పనిరోజుల్లో ఖైదీలను కలవవచ్చు. ఉదయుం 10 గంటల నుంచి సాయుంత్రం 4 గంటలలోపు కలవవచ్చు. ఖైదీతో సుమారు 20 నిమిషాల పాటు మాట్లాడవచ్చు. ఖైదీ తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు, వారి న్యాయవాదులు కలిసేందుకు అవకాశం ఇస్తారు.
తినుబండారాలు.. వస్త్రాలు
ఖైదీలను కలవడానికి వచ్చే వారు పండ్లు, కవర్ ప్యాకింగ్ (సీల్డ్ ఐటమ్స్) ఉన్న బిస్కెట్లు, స్వీట్లు అందించవచ్చు. దుస్తులు ఇవ్వవచ్చు. డాక్టర్ పరిశీలించిన తర్వాత సూపరింటెండెంట్ అనుమతితో మందులు ఇవ్వవచ్చు. ముందుగా వీటిని జైలు సిబ్బంది పరిశీలించిన తర్వాతే ఖైదీలకు అందిస్తారు. ఖైదీలకు సొమ్ములు ఇవ్వాలనుకుంటే వాటిని జైలు సిబ్బందికి ఇస్తే పీపీసీకి (ప్రజనీర్స్ ప్రైవేట్ క్యాష్) నందు డిపాజిట్ చేస్తారు.
ఫోను.. పోస్టు కార్డు సౌకర్యం
జైలులో ఉన్న ఖైదీలకు ఫోన్ సదుపాయం కల్పిస్తారు. కాల్‌కు 5 నిమిషాలకు రూ.10 వసూలు చేస్తారు. ఫోను సంభాషణలు జైలు శాఖ ఉన్నత కార్యాలయంలో రికార్డు అవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఖైదీలు మాట్లాడాల్సి ఉంటుంది. జైలులో ఫోను ఉపయోగించని వారికి నెలకు రెండు సార్లు పోస్టు కార్డులు అందిస్తారు. 15 రోజులకోసారి ఖైదీలకు ఉత్తరం రాసుకునే అవకాశం కల్పిస్తారు.