అప్రమత్తం
పోలియో వైరస్‌పై వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్
నేటి నుంచి ప్రత్యేక ‘వ్యాక్సినేషన్’ డ్రైవ్
24 ప్రాంతాల్లో ఇంటింటి సర్వే
సిటీబ్యూరో:నగరంలోని అంబర్‌పేట నాలా మురుగు నీటిలో టైప్-2 పోలియో వైరస్ ఉన్నట్లు తేలడంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. నివారణ చర్యలకు వెంట నే రంగంలోకి దిగింది. ఈ మేరకు సోమవా రం నుంచి నగరంలో వారం రోజుల పాటు ప్రత్యేక పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. కాగా వైరస్ ఉన్నట్లు నిర్ధారణైన 14 రోజుల్లో నివారణ చర్యలు చేపట్టాల్సి ఉండటంతో హైదరాబాద్ జిల్లా పరిధిలోని అంబర్పేట్, బార్కాస్, కంటోన్మెంట్, మలక్‌పేట్, కోఠి, లాలాపేట్, డబీర్‌పుర, జంగంమెట్, పానిపుర, సీతాఫల్మండి, సూరజ్భానులతో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలోని కుత్బుల్లాపూర్, మల్కజ్గిరి, బాలానగర్, మల్కజ్గిరి, ఉప్పల్, నారపల్లి, కీసర, అబ్దుల్లాపూర్, సరూర్‌నగర్, బాలాపూర్‌లో ఇప్పటికే ఇంటింటి సర్వే నిర్వహించింది. ఆయా ప్రాంతాల్లోని ఆరు వారాల నుంచి మూడేళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇందుకు అవసరమైన వ్యాక్సిన్‌ను చెన్నై నుంచి తెప్పించి ఆయా ఆరోగ్య కేంద్రాల్లో సిద్ధంగా ఉంచింది.
ఆరు వారాల నుంచి మూడేళ్లలోపు వారంతా వేసుకోవాలి
నోటి ద్వారా ఇచ్చే పోలియో వ్యాక్సిన్‌కు అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఎప్పుడో స్వస్తి పలికాయి. ప్రస్తుతం అక్కడ ఐపీవీ ఇంజక్షన్ ఇస్తున్నారు. మన దేశంలో కూడా దీన్ని అమలు చేస్తున్నారు. ఇంజక్షన్‌పై అనవసర అపోహలు పెట్టుకోవద్దు. పుట్టిన ఆరు మాసాల పిల్లల నుంచి మూడేళ్లలోపు పిల్లలందరూ టీకాలు వేయించుకోవాలి. కుడి చేతికి పాయింట్ వన్ ఎంఎల్ ఇంజక్షన్ ఇస్తారు.
- డాక్టర్ ప్రసన్న, ఇన్చార్జి, జిల్లా చిన్నపిల్లల వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం
అపోహలు వద్దు
ఇప్పటి వరకు ఓరల్ వ్యాక్సిన్‌కు అలవాటు పడిన వారు అకస్మాత్తుగా ఇంజక్షన్ అంటే కొంత భయపడటం సహజమే. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్‌పై అపోహలు అసలే వద్దు. ఐపీవీ వ్యాక్సిన్‌ను ఇంజెక్షన్ రూపంలో చిన్న పిల్లలకు ఇస్తున్నందున సహజంగా కొద్దిపాటి నొప్పి ఉంటుంది. అలాగే చిన్న దద్దుర్లు వస్తాయి. అంతేకానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
- ప్రొఫెసర్ రమేష్ దాంపురి, నిలోఫర్ ఆస్పత్రి