డైరెక్షన్ వదిలేసి..పాకిస్థాన్ కు వెళ్లిపోతా!
‘‘నేను ‘వార్’ అనే పాకిస్తానీ చిత్రాన్ని చూశాను. నన్ను నేను నమ్మలేనంతగా షాక్‌కి గురయ్యాను. ‘వార్’ చిత్రం చూసిన తర్వాత డెరైక్షన్ వదిలేసి.. పాకిస్తాన్ వెళ్లి.. ఆ చిత్ర దర్శకుడు బిలాల్ లషారీ వద్ద అసిస్టెంట్‌గా చేరాలనిపించింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్‌కు పాకిస్తాన్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. షారుక్ నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ చిత్రం అక్కడ తొలిరోజు 9 మిలియన్ల రూపాయలు వసూలు చేస్తే.. ‘వార్’ చిత్రం 11.4 మిలియన్ల రూపాయలను వసూలు చేసింది.
ఈ చిత్రం చూసిన తర్వాత నాకు అనిపించింది ఒక్కటే. భారతీయ దర్శకులు గొప్పవాళ్లమనే భావన నుంచి బయటపడాలి. అంతేకాకుండా పాకిస్తానీ చిత్రాలపై సీరియస్‌గా దృష్టి సారించాలి. ‘బిలాల్ లషారీ నువ్వు ఎక్కడున్నా.. నీకు నా సెల్యూట్. ఏదేమైనా సినిమా పరిశ్రమలో నేనొక విద్యార్థిని.. నీ చిత్రం చూసి థ్రిల్ అయ్యాను’. పాకిస్తాన్లో నాకు తెలిసినవారు ఎవరైనా బిలాల్‌కు పరిచయం ఉన్నట్లయితే.. నా తరఫున కంగ్రాట్స్ అందించాలి’’ అని పొగడ్తలతో ముంచెత్తారు రామ్‌గోపాల్‌వర్మ.
భారతీయుల మనోభావాలకు వ్యతిరేకంగా ఆ చిత్రం ఉన్నప్పటికీ దర్శకుడు బిలాల్ పనితీరుకు ముగ్ధుడయ్యానని, ఈ చిత్రానికి షోమన్ మన్సూర్ అనే వ్యక్తి అసిస్టెంట్‌గా పనిచేశారని.. తాను సెకండ్ అసిస్టెంట్‌గా చేరడానికైనా సిద్ధమని ఈ సందర్భంగా వర్మ అన్నారు. ఆ చిత్రం గురించి గొప్పగా చెప్పుకుంటుంటే.. ఆపుకోలేక పైరేటెడ్ వెర్షన్ చూశానని, అందుకు క్షమించాలని వర్మ ట్విటర్లో పేర్కొన్నారు. అంతేకాక భారతీయ చిత్ర ప్రముఖులకు ‘వార్’ చిత్రం కాపీని పంపి.. పుణ్యం కట్టుకోవాలని వ్యాఖ్యలు చేశారు. వర్మ ఇలా వ్యాఖ్యలు చేయడం ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని పలువురు అంటున్నారు.