చికిత్స ‘అత్యవసరం’...
జీజీహెచ్ దుస్థితి
= క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ల కొరత
= పనిచేయని వాల్ సెక్షన్స్ ఆపరేటర్స్
= అరకొర మందులతో ఇబ్బందులు
కొన ఊపిరితో వచ్చిన వారి ప్రాణాలు నిలపాల్సిన ప్రభుత్వాస్పత్రి అత్యవసర చికిత్సా విభాగానికే సుస్తీ చేసింది. అవసరమైన మందులు, సిబ్బంది కొరత.. రాత్రి వేళల్లో పనిచేయని సీటీస్కాన్.. అందుబాటులో లేని 24 గంటల లేబరేటరీలతో సకాలంలో చికిత్స అందించలేక చేతులెత్తేయాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో తొలుత ఇక్కడకు వచ్చిన ప్రమాద బాధితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కార్పొరేట్ ఆస్పత్రుల వైపు పరుగులు తీస్తున్నారు.
విజయవాడ, న్యూస్‌లైన్ : జిల్లాతో పాటు పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల నుంచి నిత్యం వందలాదిమంది రోగులు అత్యవసర వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి వస్తుంటారు. అయితే ఇక్కడ పూర్తిస్థాయి వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో సకాలంలో చికిత్స అందించలేక పోతున్నారు. ఇటీవల గుడ్లవల్లేరు మండలం అంగలూరు మోడల్హాస్టల్ విద్యార్థినులు కలుషితాహారం తిని అస్వస్థతకు గురికాగా, వారిని మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు.
వారికి అత్యవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో అర్ధరాత్రి వేళ సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో అప్పటికయితే కొన్నారు కానీ, సాధారణ రోగులు వస్తే పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 28 ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాదానికి గురికాగా, ఏలూరు ప్రభుత్వాస్పత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడకు రిఫర్ చేశారు.
అర్ధరాత్రి వేళ వచ్చిన యువకుడిని పరీక్షించిన వైద్యులు తలకు సీటీ తీయాలని చెప్పారు. అయితే రాత్రివేళల్లో లేబరేటరీ అందుబాటులో లేకపోవడంతో గుంటూరు ఆస్పత్రికి వెళ్లాలని సలహా ఇచ్చారు. దీంతో రూ.రెండువేలు వెచ్చించి అంబులెన్స్‌లో గుంటూరు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. ఇలాంటి సంఘటనలు ఇక్కడ నిత్యకృత్యం.
అందుబాటులోకి రాని వ్యాధి నిర్ధారణ పరీక్షలు..
పేరుకు పెద్దాస్పత్రే అయినా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉదయం వేళల్లోనే అందుబాటులో ఉంటున్నాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత రోగి ఆస్పత్రికి వస్తే వారికి అత్యవసరంగా అవసరమైన నిర్ధారణ పరీక్షలన్నీ వందలాది రూపాయలు వెచ్చించి ప్రైవేటు ల్యాబుల్లో చేయించాల్సిందే. గాయాలతో వచ్చిన వారికి చికిత్స చేయాలని, అత్యవసర ఆపరేషన్లు నిర్వహించాలన్నా హెచ్ఐవీ, హెపటైటీస్ బీ వంటి పరీక్షలు ఖచ్చితంగా చేయాల్సి ఉంది. అయితే 24 గంటల లేబరేటరీల సేవలు అందుబాటులోకి రాకపోవడంతో రోగులు వేలాది రూపాయలను కార్పొరేట్ ఆస్పత్రులకు చెల్లించాల్సి వస్తుంది.
సీఎంవోల కొరత ...డీఎంఈ ఆదేశాలు భేఖాతర్...
అత్యవసర చికిత్స విభాగంలో కనీసం 10 మందికి పైగా వైద్యులుండాలి . కానీ వారిలో సగం మంది కూడా లేకపోడంతో మూడు నెలలుగా వైద్యులకు సెలవులు ఇవ్వడం లేదు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్యులు తరచూ కోర్టులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ రోజుల్లో మరీ ఇబ్బందిగా ఉంటుంది. సీఎంవోల కొరత విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యూ సూర్యకుమారి రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుల దృష్టికి తీసుకెళ్లడంతో సిద్ధార్థ వైద్య కళాశాలలో ట్యూటర్లుగా ఉన్న ఏడుగురిని సీఎంవోలుగా డెప్యూట్ చేయాలని ప్రిన్సిపాల్‌కు ఆదేశాలొచ్చాయి.
కానీ వారిలో ఇద్దరిని అప్పటికే డెప్యూట్చేయగా, మిగిలిన ఐదుగురిని ప్రిన్సిపాల్ డెప్యూట్ చేయక పోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాలు ఆచరణకు నోచెకోక పోవడంపై పలువురు వైద్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వారిలో ఒకరికి పదోన్నతి లభించి రెండు రోజుల్లో రిలీవ్ కానున్నారు.అప్పుడు పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి.