‘చిన్నారులకు ఉపకరణాల పంపిణీకి గుర్తించాం’
జిల్లా సర్వ శిక్షాఅభియాన్ సహిత విద్య, ప్రత్యేకావసరాల చిన్నారుల కో ఆర్డినేటర్ వెన్నన లక్ష్మణ్‌కుమార్
రంగంపేట : జిల్లాలో ప్రత్యేకావసరాలు గల 1,480 మంది చిన్నారులకు ఉపకరణాలు పంపిణీ చేయనున్నట్టు జిల్లా సర్వ శిక్షాఅభియాన్ సహిత విద్య, ప్రత్యేకావసరాల చిన్నారుల కో ఆర్డినేటర్ వెన్నన లక్ష్మణకుమార్ తెలిపారు. సోమవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. వీరిలో 571 మందికి వినికిడి యంత్రాలు, 66 మూడు చక్రాల సైకిళ్లు, 148 మందికి కృత్రిమకాళ్లు, 197 మందికి వీల్ చైర్స్, 182 రొటేటర్లు, 40 మందికి బ్రెయిలీ కిట్స్ అవసరాన్ని గుర్తించామని, వీటిని త్వరలో అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. 61 మండలాల్లో 1266 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు. వీరికోసం ప్రతి సోమ, బుధ, శుక్రవారాలలో 21 మంది ఫిజియోథెరపిస్టులు ఫిజియోథెరఫీ నిర్వహిస్తున్నారని, 1306 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారన్నారు. పూర్వ పాఠశాల దశలోకూడా ప్రత్యేకావసరాలు గల పిల్లలు 176 మందిని గుర్తించి శిక్షణ ఇస్తున్నామన్నారు. భవిత కేంద్రాలకు వచ్చే 950 మందికి రవాణా చార్జీలు, వీరిని తీసుకువచ్చే 614 మంది తల్లిదండ్రులకు రూ.250 చొప్పున ఎస్కార్ట్ అలవెన్స్ ఇస్తున్నామన్నారు. పాఠశాలకు హాజరు కాలేని తీవ్ర మానసిక వైకల్యం గలవారికి ఇంటి వద్దనే తర్ఫీదు ఇస్తున్నామన్నారు. ప్రతి పాఠశాలలో ప్రత్యేకావసరాల పిల్లలతో పాటు, సాధారణ విద్యార్థులతో కలిపి సహిత క్లబ్‌లు ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. గ్రామాలలో బహిరంగ మల విసర్జన లేని గ్రామాలను తయారు చేయడం కోసం ఆయా గ్రామా ప్రధానోపాధ్యాయులకు, సంబంధిత ఎంపిక బృందాలకు శిక్షణ ఇస్తున్నామని, నూరు శాతం లక్ష్యసాధనకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు.