గాలివానపై మంత్రి, మేయర్ సమీక్ష
హైదరాబాద్: శుక్రవారం సాయంత్రం నగరంలో బీభత్సం సృష్టించిన గాలిదుమారంపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ సమీక్షించారు. శనివారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ కంట్రోల్ రూంలో వారు ఇరువురు ఉన్నతాధికారులతో మాట్లాడారు. గాలి తీవ్రతకు జీహెచ్ఎంసీ పరిధిలోని 600 కరెంటు స్తంభాల్లో 300 నేలకూలాయని వారు తెలిపారు. వీటితోపాటు భారీ హోర్డింగులు లెక్కలేనన్ని పడిపోయాయన్నారు. నగరంలో 245 వరకు ఉన్న 11కేవీ ఫీడర్స్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పేర్కొన్నారు. రాత్రి 1.45 గంటల కల్లా 205 ఫీడర్లలో అధికారులు విద్యుత్ సరఫరా పునరుద్ధరించగలిగారని చెప్పారు.
మొత్తం 1500 మంది సిబ్బంది, అధికారులు ఈ పనుల్లో పాల్గొన్నారన్నారు. ఈ రోజు తెల్లవారుజామున 3గంటల వరకు తాను, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి పర్యవేక్షించారని చెప్పారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వాటిని కూడా అధికారులు ముమ్మరం చేశారని తెలిపారు. అయితే, నగరంలో ఏర్పాటు చేసిన హోర్డింగులకు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను మాత్రమే తట్టుకునేట్లు ఏర్పాటు చేశారని, కానీ, 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయటంతో తట్టుకోలేక అవి పడిపోయాయని వారు వివరించారు. గాలి వాన ఆగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించటంతో చాలా వరకు సమస్యలను దూరం చేయగలిగామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు.