ఈ ఫలితాలే రిపీట్ అవుతాయి: కవిత
హైదరాబాద్ : వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల ఫలితాలపై నిజామాబాద్ ఎంపీ కె. కవిత బుధవారం హైదరాబాద్‌లో స్పందించారు. టీఆర్ఎస్ విజయం ద్వారా కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు బలపరిచారని ఆమె స్పష్టం చేశారు. ఈ మహా విజయం అందించిన ప్రజలకు కవిత ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేరుస్తామన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న మంచి పనులను ప్రజలు విశ్వసిస్తున్నారని కవిత తెలిపారు.
అయితే మంగళవారం మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందాన్ని కొన్ని పార్టీలు జీర్ణించుకోలేక పోతున్నాయని ఆమె ఆరోపించారు. రాజకీయ అస్థిత్వం కోసమే ఆ పార్టీ నాయకులు ఈ విమర్శలు చేస్తున్నారన్నారు. 2019 ఎన్నికల్లో ఈ ఫలితాలే రిపీట్ అవుతాయని కవిత ఈ సందర్భంగా జోస్యం చెప్పారు.
ఆత్మవిమర్శ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆమె హితవు పలికారు. 60 ఏళ్లలో ఆ పార్టీ చేయలేనిది ... ఏడాదిన్నరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం వల్ల ఆదిలాబాద్‌తో సహా మిగతా జిల్లాలకు సాగు, తాగు నీరు అందుతుందన్నారు. తమ పార్టీపై విమర్శలు మానుకోకపోతే... వచ్చే ఎన్నికల్లో 2 లేదా మూడు సీట్లు కూడా రావని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కవిత సూచించారు.